న్యూస్‌రీల్
డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముకు ఎసరు ఆర్పీలు, సీవోల చేతివాటం బ్యాంకుల్లో జమ చేయకుండా స్వాహా మోసాలపై నిలదీస్తే బెదిరింపులు మనస్తాపంతో గ్రూపు లీడర్ ఆత్మహత్యాయత్నం వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు యత్నాలు తెరవెనుక ‘కేంద్ర మంత్రి’ ఓఎస్‌డీ కుటుంబ పెత్తనం కమీషన్ల కోసం నకిలీ సమాఖ్యల ఏర్పాటు
‘డమ్మీ’ సమాఖ్యలు..
గుంటూరు
ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9990 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
నెహ్రూనగర్: పేద, మధ్యతరగతి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉద్దేశించిన ‘మెప్మా’ (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అవినీతి అడ్డాగా మారింది. కష్టపడి పొదుపు చేసుకుంటూ రుణాలు తీర్చుకుంటున్న డ్వాక్రా మహిళల నమ్మకాన్ని కొందరు అధికారులు, సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి ఆర్పీలు (రిసోర్స్ పర్సన్లు) మొదలుకొని కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవోలు), సిటీ మిషన్ మేనేజర్లు (సీఎంఎంలు), ఆపై అధికారులు సిండికేట్‌గా ఏర్పడి మహిళా గ్రూపుల సొమ్మును యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. రుణాలు చెల్లించామంటూ నకిలీ రసీదులు సృష్టించి రూ.లక్షల నిధులను దారి మళ్లిస్తున్న వైనం తాజాగా గుంటూరు నగరంలో వెలుగుచూసింది.
గ్రూపు లీడర్ ఆత్మహత్యాయత్నం
గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ డ్వాక్రా గ్రూపు సభ్యులు బ్యాంకు లోనుకు సంబంధించి క్రమం తప్పకుండా చెల్లించిన సుమారు రూ.లక్ష నగదును ఆర్పీ గౌసియా, సీవో ఆదినారాయణ కలిసి స్వాహా చేశారు. బ్యాంకులో జమ చేయకుండా ఆ సొమ్మును సొంతానికి వాడుకుని, సభ్యులకు మాత్రం నకిలీ బ్యాంకు రసీదులను చూపించి నమ్మించారు. రుణ బకాయి ఉందని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో కంగుతిన్న గ్రూపు లీడర్ హసీనా, ఇతర సభ్యులు ఆర్పీని నిలదీశారు. ఫలితం లేకపోవడంతో మెప్మా ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరికి ఆర్పీ గౌసియా ఇంటికి వెళ్లి నిలదీయగా.. ఎదురుదాడికి దిగి అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లీడర్ హసీనా కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, ఈ ఘటనపై నగరంపాలెం పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. అయితే, విషయం బయటకు పొక్కకుండా, తమ అవినీతి బండారం ఎక్కడ పడుతుందోనన్న భయంతో మెప్మా సిబ్బంది రంగంలోకి దిగారు. బాధితులను సముదాయించేందుకు, రాజీ కుదిర్చేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి ఓఎస్‌డీ పెత్తనం
మెప్మాలో జరుగుతున్న ఈ దందా వెనుక రాజకీయ అండదండలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓఎస్‌డీ భార్య విజయలక్ష్మి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)గా వ్యవహరిస్తున్నారు. వారి అండ చూసుకునే కిందిస్థాయి సిబ్బంది చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెప్మా డిపార్ట్‌మెంట్‌లో ఏది జరిగినా ఎటువంటి చర్యలు ఉండవనే విమర్శలు బహిరంగంగానే వెల్లువెత్తుతున్నాయి. సదరు డిపార్ట్‌మెంట్‌పైన ఏదైనా ఫిర్యాదులు వస్తే వెంటనే కేంద్ర మంత్రి ఓఎస్‌డీ రంగంలోకి దిగి ఆయన కింద వ్యక్తులతో సదరు అంశాన్ని చక్కబెడతారనే ఆరోపణలు ఉన్నాయి. సెప్టెంబర్ ఆఖరు నాటికి బ్యాంకు రుణాల టార్గెట్లు రావడమే అదనుగా భావించిన సిబ్బంది... ఒక్కో లోను మంజూరుకు రూ. లక్షకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు దర్జాగా దండుకున్నట్లు సమాచారం.
గుంటూరు నగర కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 10,619 డ్వాక్రా గ్రూపులు ఉండగా, వీటి పర్యవేక్షణకు 317 మంది ఆర్పీలు, 26 మంది సీవోలు, ఇద్దరు సీఎంఎంలు పనిచేస్తున్నారు. సాధారణంగా ప్రతి స్లమ్ కింద ఏర్పాటయ్యే స్లమ్ సమాఖ్య పరిధిలో 25 నుంచి 50 గ్రూపులు ఉంటాయి. కానీ అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షలు తీసుకుని ఆర్‌పీ పోస్టులను సృష్టిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పేదల కష్టార్జితాన్ని మింగేస్తున్న ఈ మెప్మా సిండికేట్‌పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు.


