ప్రయాణమే నరకప్రాయం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణమే నరకప్రాయం

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

ప్రయాణమే నరకప్రాయం

దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల తాకిడి సర్వీసులు పెంచడంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం ప్రత్యేక బస్సుల ఏర్పాటులో అధికారుల ఉదాసీనత ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

పట్నంబజారు: దసరా శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకల్లో భాగంగా విద్యాసంస్థలకు ఈ నెల 12వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో 10, 11 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం కూడా కలిసి రావడంతో ప్రయాణికులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా గుంటూరు డిపో 1, 2 నుంచి అధికంగా వెళుతున్నారు. కానీ తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు మాత్రం చేయలేదు. కనీస చర్యలు తీసుకోలేదు. ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. బస్సు వస్తే సీటు కోసం పాట్లు తప్పలేదు. చాలా రూట్లలో బస్సు ఎక్కేందుకు కూడా నానా తంటాలు పడుతున్నారు.

‘ప్రత్యేక’ ఏర్పాట్లు శూన్యం

గుంటూరు ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో 400 బస్సుల వరకు ఉన్నాయి. వీటిలో పల్లెవెలుగు బస్సులే 250 వరకు ఉన్నాయి. పండుగ వస్తే స్పెషల్‌ బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు ఊదరగొట్టడమే తప్ప, ఉన్న బస్సులను మాత్రమే నడుపుతున్నారు. వీటిలో సుమారు 40 నుంచి 50 బస్సుల వరకు గ్యారేజీకే పరిమితమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. బస్సులు సరిగా లేకపోవడం, సాంకేతిక సమస్యలు, మరమ్మతుల కారణంగా గ్యారేజీల్లోనే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా గుంటూరు డిపో 2 నుంచి 90 బస్సులను ఇతర డిపోలకు పంపించేశారు. ఇక పండుగ వచ్చినా, ఏదైనా విశేషమైన రోజు వచ్చినా ప్రయాణికులు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.

నిత్యం లక్ష మంది ప్రయణిస్తున్నా...

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి నిత్యం లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అధికారులే చెబుతున్నారు. పండుగ సమయాల్లో మరో 30 వేల నుంచి 50 వేల మంది వరకు అదనం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌ కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. బస్సు రాగానే సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బస్సుల్లో కూర్చునే అవకాశం లేక నిల్చునే ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు, రీజియన్‌ పరిధిలోని ఆయా డిపోల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. ఇక మార్గమధ్యంలో బస్సులను ఆపలేకపోతున్నామని సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు.

ముందస్తు చర్యలపై శ్రద్ధ ఏదీ?

దసరా శరన్నవరాత్రుల సమయంలో అనేక దూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌కు వస్తుంటారు. ప్రతి ఏడాది ఈ విషయం అధికారులకు తెలిసిందే. అయినప్పటికీ, పలు డిపోల నుంచి బస్సులను తీసుకొచ్చేందుకు కూడా కనీస చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో బస్సులను అధికంగా నడపాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలులో ఉన్న నేపథ్యంలో పండుగ రద్దీ సమయంలో అదనపు బస్సుల ఏర్పాటుపై అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement