జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
గుంటూరు మెడికల్: ‘‘అయ్యా.. చంద్రబాబుగారు మా ఉద్యోగాలు రెగ్యులర్ చెయ్యండి.. మాకు న్యాయం చేయండి’’ అంటూ కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు జోలె పట్టుకుని బిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మూతి మీద వేలు పెట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తాము ఎదుర్కొంటున్న బాధలు ముఖ్యమంత్రి విని తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులరయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని సెలవులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగి మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు రోజులుగా తాము రోడ్డెక్కి తమ గోడు వెళ్లబోసుకుంటున్నా తమ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు శనివారం టీబీ కాంట్రాక్ట్ యూనియన్, లాయర్స్ యూనియన్, ఇతర సంఘాల నేతలు తమ మద్దతు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ఐదో రోజు సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్‌లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతోందని జేఏసీ నేతలు వెల్లడించారు.


