పెదకాకాని శివాలయంలో నిర్వహణకు పూర్తయిన ఏర్పాట్లు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఆదివారం నుంచి దసరా నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారు కదంబవనవాసినీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఉదయం ఐదు గంటలకు సుప్రభాతసేవ, హారతులు, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, సువావరణార్చనలు జరుగుతాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి భ్రమరాంబదేవి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, పంచహారతులు, ఆలయ ప్రదక్షిణ, తీర్థప్రసాదాల పంపిణీ జరుగుతుంది. శరన్నవరాత్రుల్లో దేవస్థాన యాగశాలలో రుద్రహోమం, చండీ హోమాలు నిర్వహించనున్నారు. రూ.1,500 చెల్లించి ప్రత్యక్షంగా హోమంలో భక్తులు పాల్గొనే అవకాశం కల్పించారు. ఉభయదాతల పూజలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అమ్మవారిని దర్శించుకుని, అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు కోరారు. ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవస్థానం, యాగశాలకు ప్రత్యేక పూల అలంకరణ, దేవస్థాన ఆర్చిగేటులో అమ్మవారి అలంకారంలో ప్రత్యేక విద్యుత్ కటౌట్ ఏర్పాటు, నిత్యం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి విజయవాడ పీవీఏ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తిరంజని, పెదకాకాని కళాశ్రీ డ్యాన్స్ అకాడమి వారిచే కూచిపూడి నృత్యాలు, పెదకాకాని కందిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గణపతి మహాత్యం పూర్తి నాటకం ప్రదర్శించనున్నారు.


