ఆటోనగర్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

ఆటోనగర్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

ఆటోనగర్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తిరుచానూరుకు ప్రత్యేక రైలు పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చీకటి గోపి హత్య కేసులో వీఆర్‌కు కానిస్టేబుల్‌

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

పెదకాకాని: గుంటూరు ఆటోనగర్‌లో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికపై దృష్టి పెట్టామని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ నసీర్‌ అహ్మద్‌తో కలిసి శనివారం ఆయన ఆటోనగర్‌లో పర్యటించారు. వసతులు, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు తదితర అంశాలను పరిశీలించారు. అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆటోనగర్‌ అభివృద్ధికి దశలవారీగా చర్యలు చేపడతామని చెప్పారు. ఆటోనగర్‌ అభివృద్ధికి రూ. 30 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఆటోనగర్‌ పారిశుద్ధ్య పనులు, రహదారుల నిర్మాణం వంటి అవసరాలను గుర్తించామన్నారు. రైల్వే గేటు సమీపంలో ఉన్న వ్యర్థాలను మరొక ప్రదేశానికి తరలించే అవకాశాలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పాత వాహనాలు పగులగొట్టడం, రోడ్లపై చెత్తాచెదారం వేయడం వలన వాహనాల రాకపోకలకు అసౌకర్యంగా ఉందన్నారు. ఎమ్మెల్యే షేక్‌ నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ రహదారులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్‌డీవో కె. శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జీఎం నరసింహారావు, గుంటూరు నగరపాలక సంస్థ కార్యనిర్వహక ఇంజినీర్‌ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపురం: దక్షిణ తీర రైల్వే గుంటూరు డివిజన్‌ మీదుగా తిరుచానూరుకు ప్రత్యేక రైలును కేటాయించినట్లు సీనియర్‌ డీసీఎం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైలు (07227) ఈ నెల 13వ తేదీన గుంటూరు జంక్షన్‌ నుంచి సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి తిరుచానూరు స్టేషన్‌కు 14వ తేదీ ఉదయం 7.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు ప్రధానంగా నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దు టూరు, యర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట జంక్షన్‌ స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. ప్రయాణికులు సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 2,423 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 11.8 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 60 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌ 513, తూర్పు కాలువకు 316, పశ్చిమ కాలువకు 111, నిజాంపట్నం కాలువకు 225, కొమ్మమూరు కాలువకు 733 క్యూసెక్కులు విడుదల చేసినట్లు తెలిపారు.

తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో పోలీసుల చిత్రహింసలకు గురై మృతి చెందిన యువకుడు చీకటి గోపి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ మురళిని వీఆర్‌కు పంపినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలు ప్రజాసంఘాలు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆందోళన మేరకు సిట్‌ విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం విచారణ చేస్తుండగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ మురళిని వీఆర్‌కు పంపించారు. గతంలో కూడా తెనాలిలో యువకులను నడిరోడ్డుపై హింసించిన కేసులో కానిస్టేబుల్‌ వీఆర్‌కు వెళ్లాడు. మళ్లీ ఇప్పుడు కూడా అవే ఆరోపణలతో వీఆర్‌కు వెళ్లడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement