సైక్లింగ్‌లో 2 లక్షల కిలోమీటర్లు పూర్తి అరుదైన రికార్డు నెలకొల్పిన గుంటూరు వాసి ఆరు పదుల వయస్సులోనూ అద్భుతాలు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర
మన ఆరోగ్యం మన చేతుల్లోనే..
గుంటూరు వెస్ట్ (క్రీడలు): నగరం నిద్రలేవక ముందే ఆరు పదుల వయస్సున్న ఒక వ్యక్తి తన సైకిల్‌ను సిద్ధం చేసుకుని రోడ్డెక్కుతారు... సూర్యుడు పలకరించేలోపే సగం గమ్యాన్ని పూర్తి చేస్తారు... సరదాగా ప్రారంభమైన పయనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనే గుంటూరుకు చెందిన బండ్లమూడి సుబ్బయ్య. వయస్సును కూడా లెక్కచేయకుండా కఠోర సాధనతో సైక్లింగ్ సుబ్బయ్యగా మారిపోయారు. బుధవారంతో సైక్లింగ్‌లో 1,623 సెంచరీలు పూర్తి చేయడంతోపాటు 2 లక్షల కిలోమీటర్లు పూర్తి చేసి ఔరా అనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన ఏకై క వ్యక్తిగా నిలిచారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యే ఆయన సైకిల్ ప్రయాణం దాదాపుగా ఉదయం 8.30 గంటలకు పూర్తవుతుంది. సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి అంశాల్లో చక్కని ప్రతిభ చాటుతున్నారు. ఈ సందర్భంగా సుబ్బయ్యను సహచర సైక్లిస్టులు స్థానిక విద్యానగర్‌లో ఘనంగా సత్కరించారు.
అంత సులభంగా దక్కలేదు..
తొలినాళ్లలో స్విమ్మింగ్ సాధన చేసిన సుబ్బయ్యకు కరోనా అనేది జీవితాన్ని కొత్త కోణంలో పరిచయం చేసింది. ఆరోగ్యం లేనిదే ఆనందకరమైన జీవితం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో తాను ఎంతగానో ఇష్టపడే సైక్లింగ్‌పై మరింత మక్కువ పెరిగింది. కొందరు స్నేహితులతో ప్రారంభమైన సైకిల్ సవారీ నేడు సుబ్బయ్యను నూతన రికార్డులు నెలకొల్పేలా మార్చేసింది. ఈ ఘనత ఆయనను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ దిశగా తీసుకెళుతోంది. పట్టణంలోని కొందరు వైద్యులతో కలిసి సైక్లింగ్ క్లబ్‌లను ప్రారంభించారు. వారిని కూడా నిరంతరం సైక్లింగ్ చేసే విధంగా ప్రోత్సహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అధికారులకు సైతం పట్టణ రోడ్లపై సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజలు ప్రతి పనికీ వాహనాలను ఉపయోగించడం వల్ల శారీరక శ్రమ లేకుండా పోతోందని చెప్పారు.
రికార్డులు భద్రం
క్రీడాకారుల కోసం అంతర్జాతీయ స్థాయిలో స్ట్రావా అనే యాప్ ఉంది. సుబ్బయ్యలాంటి సైక్లిస్టులు అందులో తమ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటే, వారు సైక్లింగ్ చేసే వేగంతోపాటు ఎన్ని కిలోమీటర్లు, ఎంత సమయంలో పూర్తి చేశారనే వివరాలు నమోదవుతాయి. సుబ్బయ్య బుధవారంతో 1,623 సెంచరీలు, 355 అర్ధ సెంచరీలు చేయడంతోపాటు 2 లక్షల కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రోజూ ఉదయం 100 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా సైకిల్ తొక్కడాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగే సైక్లింగ్ చాలెంజ్ పోటీల్లో సుబ్బయ్య అనేక విజయాలు సాధించారు. దీంతోపాటు స్విమ్మింగ్‌లో మాస్టర్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 30కి పైగా బంగారు, కాంస్య, రజత పతకాలతోపాటు మరో మూడు జాతీయ స్థాయి పతకాలు సాధించారు. కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్ల దూరాన్ని నాలుగుసార్లు ఈదుతూ బహుమతులు సాధించారు. యోగా సాధనలో కూడా ఆసనాలతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం సుబ్బయ్య వయస్సు 60 సంవత్సరాలు. గతంలో ఆయన స్నేహితులతో కలిసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,700 కిలోమీటర్లు సైక్లింగ్ పూర్తి చేశారు.
నేడు ప్రతి ఒక్కరికీ కావాల్సింది ఆరోగ్యమే. దాని కోసం మనం ఏం చేస్తున్నామనేదే కీలకం. నేను సైక్లింగ్‌ను ఎంచుకున్నాను. అది నాకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించడంతోపాటు రికార్డులు, పేరుప్రఖ్యాతులను తీసుకొచ్చింది. సంపాదన మోజులో పడి చాలా మంది ఆరోగ్యంపై కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఆరోగ్యం ఒక్కసారి చేజారితే ఏం చేసినా ఫలితం ఉండదు. ఉన్నప్పుడే కాపాడుకోవాలి. నా తదుపరి లక్ష్యం ఐరన్‌మ్యాన్‌తోపాటు భారత్ టూర్. ప్రభుత్వం కూడా సైక్లిస్టులకు ప్రోత్సాహం కల్పిస్తే నాలాంటి సైక్లిస్టులు వెలుగులోకి వస్తారు. చివరి శ్వాస వరకు సైక్లింగ్ ఆపను.
– బండ్లమూడి సుబ్బయ్య


