గుంటూరు మెడికల్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు హైరిస్క్ ప్రెగ్నెన్సీ ప్రొటోకాల్స్‌పై శిక్షణ కార్యక్రమం మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగింది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ గర్భిణీల్లో అధిక ప్రమాద పరిస్థితులు ముందుగానే గుర్తించడం, అవసరమైన ప్రాథమిక చికిత్స అందించడం, సరైన సమయంలో పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయడం వంటి అంశాలపై ఏఎన్‌ఎంలు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకోవాలని చెప్పారు. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 6, 7 తేదీల్లో కొంత మందికి శిక్షణ అందిస్తున్నామని, అనంతరం 12, 13 తేదీల్లో, 15, 16 తేదీల్లో, 22, 23 తేదీల్లో, 26, 27 తేదీల్లో, 29, 30 తేదీల్లో బ్యాచ్‌ల వారీగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరుగుతోందన్నారు. పీహెచ్‌సీలు, అర్బన్ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు వారికి కేటాయించిన తేదీల్లో శిక్షణకు హాజరై మాతా శిశువు మరణాలు తగ్గింపే లక్ష్యంగా నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. వైద్య అధికారులు తమ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు శిక్షణకు హాజరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రీవల్లి, వైద్య అధికారులు డాక్టర్ కె.ప్రియాంక, డాక్టర్ ప్రవీణా దీప్తి, డాక్టర్ ఇందిరి, రవికుమార్, డాక్టర్ చరణ్, పాల్గొన్నారు.


