నేటి నుంచి ఎస్‌ఆర్‌ఎంలో అమరావతి సాహిత్య సంబరాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌ఆర్‌ఎంలో అమరావతి సాహిత్య సంబరాలు

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

నేటి నుంచి ఎస్‌ఆర్‌ఎంలో అమరావతి సాహిత్య సంబరాలు

మూడు రోజులపాటు సాహితీ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు 9న ముఖ్య అతిథిగా పద్మశ్రీ బ్రహ్మానందం

మంగళగిరిటౌన్‌: అమరావతి సాహిత్య ఉత్సవాలకు ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ముస్తాబైంది. అక్టోబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్‌ చైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్విని, గుంటూరు జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించనున్నారు. చివరి రోజైన 9వ తేదీ సాయంత్రం సినీ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ‘మారుతున్న ప్రపంచానికి కథలు’ అనే నినాదంతో ఈ ఏడాది సాహిత్య ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భాషలు, సాహిత్య సంప్రదాయాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడం, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, విమర్శకులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని కన్వీనర్‌ డాక్టర్‌ ఆర్గా బసు తెలిపారు. కర్ణాటకకు చెందిన మిని కృష్ణన్‌, కేరళకు చెందిన అప్పుపెన్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన చార్బక్‌ దీప్తా, తెలంగాణకు చెందిన పూర్ణిమా తిమ్మారెడ్డి, తమిళనాడుకు చెందిన సంహితా సిన్హా, న్యూఢిల్లీకి చెందిన దినేష్‌ శర్మ తదితర ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొననున్నారు. సాహిత్య ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ కళాకారుడు బేగర్‌ శివకుమార్‌ దర్శకత్వంలో యక్షగాన ప్రదర్శన నిర్వహించనున్నారు. సంగీతం, నృత్యం, సంభాషణలు, నాటకీయ అభినయం ద్వారా కర్ణాటకకు చెందిన సంప్రదాయ రంగస్థల కళారూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. అదేవిధంగా ‘ప్రహేళిక’ పేరుతో వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు సాహిత్య అంశాలపై క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ తెలిపారు.

9న బ్రహ్మానందం ప్రసంగం

అమరావతి సాహిత్య ఉత్సవాల్లో చివరి రోజు సినీ హాస్యనటుడు పద్మశ్రీ డాక్టర్‌ బ్రహ్మానందం పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తెలుగు అధ్యాపకుడిగా, నాటక రంగ ప్రయోక్తగా, నటుడిగా, మిమిక్రీ కళాకారుడిగా, చిత్రకారుడిగా విభిన్న రంగాల్లో ప్రతిభ చాటిన ఆయన తెలుగు భాష, సాహిత్యంపై ప్రసంగించనున్నారు. అక్టోబర్‌ 9న సాయంత్రం 3 గంటలకు ఆయన యూనివర్సిటీకి చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కల్లూరి వినాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement