రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
పెదకాకాని: మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు పెదకాకాని సీఐ టి.పి.నారాయణస్వామి తెలిపారు. పెదకాకాని పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. పెదకాకాని లూధర్‌గిరి కాలనీకి చెందిన కూరపాటి సంతోష్‌కుమార్, సరిత దంపతులు నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న జొన్నకూటి రాంబాబు, రాణిల నివాసంలో సెప్టెంబరు 30వ తేదీన సుమారు రూ.10 లక్షల విలువ కలిగిన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు జొన్నకూటి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కూరపాటి సరిత బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించడంతో గతంలోనూ అదే ప్రాంతంలోనే మరో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు సరితపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. మూడు కేసుల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాల విలువ రూ.25 లక్షలపైనే ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో నిందితురాలైన సరిత ముందుగా ఆ ఇంటి వారితో పరిచయం పెంచుకుని ఇంటికి వేసే తాళం చెవి ఒకటి మాయం చేస్తుంది. ఇంటికి తాళం వేసి ఉన్న సమయంలో మాయం చేసిన ఆ తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాల దొంగిలిస్తుందని సీఐ తెలిపారు. ఒక ఇంటిలో ఒక గోల్డ్ నెక్లెస్, మూడు గోల్డ్ చైన్లు, ఏడు గోల్డ్ రింగులు, 5 జతల చెవి పోగులు, రెండు జతల వెండి పట్టీలు దొంగిలించగా మరొక ఇంటిలో ఒక నల్లపూసల తాడు, ఒక గోల్డ్ నెక్లెస్ మాయం చేసింది. అలానే మూడవ ఇంటిలో ఒక గోల్డ్ చైన్, ఒక జత చెవి చుట్టలు, ఒక జత మాటీలు, మూడు గోల్డ్ రింగులు, ఒక జత జూకాలు, ఒక మంగళసూత్రం దొంగిలించినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు కూరపాటి సంతోష్, భార్య సరితను అరెస్ట్ చేసి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నారాయణస్వామి తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు సీహెచ్ సురేష్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


