వసూళ్ల మత్తులో ఫిరంగిపురం పోలీసులు? | - | Sakshi
Sakshi News home page

వసూళ్ల మత్తులో ఫిరంగిపురం పోలీసులు?

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

వసూళ్ల మత్తులో ఫిరంగిపురం పోలీసులు?

పలు కేసుల్లో డబ్బులు వసూలు చేసి నిందితులను వదిలేస్తున్నట్లు ఆరోపణలు గొల్లపాలెం వివాదంలో స్టేషన్‌ బెయిల్‌ ఇస్తామని రూ. లక్షకు పైగా లంచం తీసుకుని రిమాండ్‌కు తరలించారంటూ బాధితుల ఆవేదన టీడీపీ నాయకుల పైరవీలతో బైక్‌ దొంగలు, ఇతర కేసుల్లో వచ్చిన వారికి అభయం అవినీతి మత్తులో ఉన్న పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పైరవీలు, అధికార పార్టీ నాయకుల అండదండలు వెరసి ఫిరంగిపురం మండల పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల తీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు, ఎంతటి తప్పునైనా ఒప్పు చేసేలా తయారైన వారి తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిత్య పైరవీలు, మామూళ్ల మత్తులో జోగుతూ కేసులు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కిన వారికి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దొంగతనాల కేసుల్లో సైతం లంచాలు తీసుకుని నిందితులను వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చోరీ కేసులు, రోడ్డు ప్రమాద కేసులు, నకిలీ కరెన్సీ కేసులు లాంటివి వాటిలోనూ లంచాలు పుచ్చుకుని కేసులు కట్టకపోవడం, మండలంలో విచ్చలవిడిగా బైక్‌ చోరీలు జరుగుతున్నా దొంగలను పట్టుకోవడంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ యాక్సిడెంట్‌ కేసులో టీవీఎస్‌పై వెళ్తున్న వ్యక్తిని టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టగా, ఈ కేసులో ఎంఎన్‌సీ రిపోర్టు ఉన్నప్పటికీ కేసు నమోదు చేయడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేత సిఫార్సుతో..

ఫిరంగిపురం తూర్పు బజారులో చోరీ కోసం వచ్చిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓ టీడీపీ నాయకుడి సిఫార్సుతో కేసు నమోదు చేయకుండా కేవలం బైండోవర్‌ చేసి వదిలేశారంటే ఎంతటి అవినీతి ఊబిలో కూరుకుపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 15న జరిగిన ఈ కేసులో నాదెండ్ల గ్రామానికి చెందిన గంజాం బాజీ అనే వ్యక్తి పట్టపగలే బైక్‌ను చోరీ చేస్తుండగా పట్టుకున్నారు. ఇతనిపై పల్నాడు జిల్లాలో 10కి పైగా చోరీ కేసులు నమోదు కాగా, ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ దొంగతనం చేసిన వ్యక్తి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకుండా తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేసి వదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు. జూలై నెలలో కార్మెల్‌ మాత ఉత్సవాల సందర్భంగా చోరులు చెలరేగిపోయి ఆరు బైకులను దొంగిలించినా పోలీసుల్లో చలనం లేదు. ఒత్తిడి మేరకు ఓ ద్విచక్ర వాహనం చోరీ అంటూ కేసు నమోదు చేయగా, మిగిలిన బైకుల సంగతేంటని బాధితులు వాపోతున్నారు. వివిధ కేసుల్లో న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేయకుండా డబ్బులు వసూలు చేసి నిందితులను వదిలేస్తుండటం నిత్యం పరిపాటిగా మారింది.

ఏ కేసైనా ఇంతే...

ఇటీవల ఓ దుకాణం వద్ద రూ.500 దొంగనోటు ఇవ్వగా, పోలీసులకు సమాచారం అందించారు. పట్టుకుని విచారించిన పోలీసులు అసలు వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. పెద్ద ఎత్తున నగదు తీసుకుని వదిలేయడంపై ఫిరంగిపురం మండల వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గొల్లపాలెం గ్రామంలోని వాలీబాల్‌ విషయంలో వచ్చిన వివాదంలో ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయి. దివ్యాంగుడికి గాయాలు అయిన నేపథ్యంలో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కానీ స్టేషన్‌ అధికారి ఈ కేసు విషయమై స్టేషన్‌ బెయిల్‌ ఇస్తామని చెబుతూ నిందితుల వద్ద నుంచి రూ. లక్షకు పైగా నగదు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నాయి. బెయిల్‌ ఇవ్వకుండా వారిని రిమాండ్‌కు తరలించడంతో కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వినాయకచవితి పందిళ్లకు అనుమతులు, డీజేల ఏర్పాటుకు భారీగా నగదు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు స్టేషన్‌ అధికారి సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినప్పుడు స్టేషన్‌కు వస్తుండటంతో ప్రజలు బారులు తీరడం మినహా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement