గుంటూరు లీగల్: సివిల్ కేసులలో దావా పత్రం చదివిన వెంటనే కేసుపై పూర్తి అవగాహన మనకు వస్తుందని, రాజీ పడదగ్గ కేసులను గుర్తించి మధ్యవర్తిత్వానికి రిఫర్ చేసి ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ చక్రవర్తి అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో శిక్షణ పొందిన మధ్యవర్తులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నియమించిన ప్రధాన శిక్షకుడు ఎస్.అరుణాచలం, ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఇన్‌చార్జి చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వి.ఎ.ఎల్ సత్యవతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాద్దీన్‌లు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గుంటూరు జిల్లా ఎక్కువ సార్లు అత్యధిక సివిల్ కేసులను రాజీ చేసినందుకు అందరికి అభినందనలు తెలిపారు. లోక్ అదాలత్ కానీ మధ్యవర్తిత్వంలో కూడా కేసులను ఎక్కువగా రాజీ చేసేందుకు మనం కృషి చేస్తూనే ఉంటామని అన్నారు. ఒకటవ అదనపు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ వి.ఎ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ సివిల్, క్రిమినల్ దావాలను రాజీ చేయడంలో మధ్యవర్తుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ ఇరువర్గాలు కేసులను శాంతియుతంగా రాజీ చేసుకునే దిశగా మధ్యవర్తి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో శిక్షణ పొందిన మధ్యవర్తులు పాల్గొన్నారు. అనంతరం రిఫెరల్ జడ్జిలకు జరిగిన పరస్పర చర్చా వేదికలో ప్రధాన శిక్షకుడు ఎస్.అరుణాచలం మాట్లాడుతూ న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై మరింత అవగాహన కల్పించారు. వారి సందేహాలకు సమాధానాలిచ్చారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రధాన శిక్షకుడైన ఎస్.అరుణాచలంని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ చక్రవర్తిని ఒకటవ అదనపు జిల్లా జడ్జి వి.ఏ.ఎల్. సత్యవతిని సత్కరించి అభినందించారు. తదనంతరం కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినందుకు ఒకటవ అదనపు జడ్జి ఎం జగదీశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బి సాయి కల్యాణ్ చక్రవర్తి


