గతేడాదితో పోల్చితే తగ్గిన 30 శాతం విస్తీర్ణం ఇటీవలి వర్షాలకు ఆశించిన ఆకుమచ్చ తెగులు మరోవైపు భారీగా పెరిగిన పెట్టుబడులు నిలకడగా ఉన్న మార్కెట్ ధరలే ఆశాజనకం
ఈ దఫా ‘కడప’కు జై
జిల్లాలో ఏటికేడాది తగ్గుతున్న పసుపు విస్తీర్ణం
గతేడాది పోలిస్తే 70శాతమే సాగు
తెనాలి: పంటల్లో పసిడిగా... ఇంటిల్లిపాది శుభప్రదంగా భావించే పసుపు పంట విస్తీర్ణం జిల్లాలో ఏటా తగ్గిపోతోంది. గతేడాదితో పోల్చితే ఈసారి 30 శాతం విస్తీర్ణం తగ్గిపోయింది. దీనికితోడు ఇటీవల వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు అక్కడక్కడా ఆకుమచ్చ కనిపిస్తోంది. పెరిగిన పెట్టుబడులకు తోడు మరికొంత అదనపు వ్యయం అనివార్యమవుతోంది. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతానికి నీటి సమస్య లేదు. మరోవైపు మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దిగుబడులపై ప్రభావం చూపకుండా ధరలు ఇదే తరహాలో ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.
తెనాలి డివిజన్‌దే అగ్రస్థానం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉద్యానశాఖ తెనాలి, గుంటూరు డివిజన్ల పరిధిలోనే పసుపు సాగవుతుందని తెలిసిందే. ఇందులో తెనాలి డివిజనుదే అగ్రస్థానం. 2021–22లో 8,166 ఎకరాల్లో పసుపు సాగుచేశారు. 2020–21తో పోల్చితే ఈ విస్తీర్ణం 2,479 ఎకరాలు తగ్గింది. ఆ ఏడాది 10,645 ఎకరాల్లో పసుపు పండించగా, అంతకుముందు ఈ విస్తీర్ణం 11,277 ఎకరాలుగా ఉంది. 2018–19లో 12,057 ఎకరాల్లో పసుపు సాగయింది. ఉమ్మడి జిల్లాలో పసుపు పంట విస్తీర్ణం క్రమేపీ తగ్గుతుందని చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. జిల్లాల పునర్విభజనతో తెనాలి డివిజనులోని అత్యధిక మండలాలు బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. విభజిత గుంటూరు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,337 ఎకరాలు. 2022–23 సీజనుకు కేవలం 3,864 ఎకరాల్లోనే రైతులు పసుపు సాగుచేశారు. ఇందులో తెనాలి నియోజకవర్గంలోనే అత్యధికంగా 2,257 ఎకరాల్లో పసుపు వేశారు. 2021–22తో పోలిస్తే జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల్లో పంట విస్తీర్ణం తగ్గింది. అయిదేళ్ల క్రితం అధిక వర్షాలకు దుంపకుళ్లుతో పంట నష్టపోయిన ఉమ్మడి జిల్లాలోని పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పరిహారాన్ని అందించి ఆదుకుంది. 2022–23లో పసుపు కనీస విస్తీర్ణం 5 వేల ఎకరాలకన్నా తక్కువగా 3,864 ఎకరాల్లోనే సాగయింది. ఆ ఏడాది కూడా మార్కెట్లో ధరలు తగ్గటంతో ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం 100–110 రోజుల దశలో ..
పసుపు ఎనిమిది నెలల కాలపరిమితి కలిగిన పంటని తెలిసిందే. ప్రస్తుతం 100–110 రోజుల దశలో ఉంది. ప్రతి సీజనులోనూ వర్షాకాలం మినహా దాదాపు 20 తడులు ఇస్తుంటారు. ప్రస్తుత సీజనులో ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ రావటం ఆశాజనక పరిణామం. పంట ఏపుగా పెరుగుతూ రైతులకు సంతోషాన్నిస్తోంది. ఇటీవలి తుఫాన్ వర్షాలకు అక్కడక్కడా చేలల్లో ఆకుమచ్చ తెగులు కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు. దీని నివారణకు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇందువల్ల మరికొంత అదనపు వ్యయమయే అవకాశం ఉందని కొల్లిపరకు చెందిన ముడుసు చంద్రారెడ్డి చెప్పారు.
ఖర్చులు తడిసి మోపెడు
పసుపు సాగుకు ఒక్కో ఎకరాకు ఆరు పుట్లు విత్తనం పసుపు నాటుతారు. ఒక్కో పుట్టికి 225 కిలోలు. పుట్టి ధర రూ.7,500 నుంచి రూ.11 వేల వరకు కొనుగోలు చేశారు. ఎకరాకు నాటే పసుపు విత్తనాన్ని ఈసారి రూ.50వేల నుంచి 65 వేల వరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. కౌలు ధర రూ.55వేల–60 వేల వరకు ఉంది. దిగుబడి వచ్చాక పసుపు ఉడికించేందుకు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎరువులకు మరో రూ.50 వేలు. నీటితడులతో సహా అన్ని ఖర్చులు కలుపుకొంటే ఎకరాకు రూ.2.50 లక్షల వ్యయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత భారీ పెట్టుబడులు పెడుతున్న రైతులకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా లేకపోవటం తరచుగా జరుగుతోంది. ఈసారి దుగ్గిరాల పసుపు మార్కెట్లో క్వింటాలు రూ.15,100 వరకు అమ్మకాలు జరుగుతుండటం రైతులకు భరోసానిస్తోంది. పంట చేతికి వచ్చేనాటికి ఇదే ధర ఉంటే లాభసాటి కాగలదని రైతులు భావిస్తున్నారు.
ఏటా కడప, మైదుకూరు, సేలం, టేకూరుపేట రకాలు, కేరళకు చెందిన ప్రగతి రకం పసుపు విత్తనాలను విత్తేవారు. మూడేళ్లక్రితం 60 శాతం రైతులు సేలం రకం విత్తనాన్నే ఆదరించారు. దిగుబడి గ్యారెంటీ, దాదాపు 4–5 శాతం కుర్కుమిన్ ఉండటంతో ఈ రకాన్నే ఎక్కువమంది సాగుచేశారు. మళ్లీ ఈ సీజన్‌కు 90 శాతం రైతులు కడప రకాలనే సాగుచేశారు. సేలం రకం పసుపునకు ఇక్కడి నేలల్లో దంపకుళ్లు వస్తోంది. ‘కడప’లో పుచ్చు తక్కువ. దిగుబడి 30 క్వింటాళ్ల వరకూ వస్తోంది. ఽసేలంతో పోలిస్తే కుర్కుమిన్ శాతం తక్కువగా ఉంటున్నా, ధరలో క్వింటాలుకు రూ.200 మాత్రమే వ్యత్యాసం ఉంటోందనే భావనతో ఈసారి అత్యధికంగా రైతులు కడప రకం పసుపును సాగుచేశారు.
2023–24 ఖరీఫ్ సీజనులో విభజిత గుంటూరు జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో పసుపు సాగును చేపట్టారు. 2024–25లో జిల్లాలో 3,682 ఎకరాల్లో సాగవగా, 2025–26లో ఆ విస్తీర్ణం 3,420 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే గత సంవత్సరంలో సాగైన విస్తీర్ణంలో 70 శాతమే సాగు చేశారనేది సుస్పష్టం, పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ దిగుబడులు తగ్గిపోవటం, మార్కెట్ ధరలు సరిగా లేకపోవటం ఇందుకు ప్రధాన కారణం. అయినా కొందరు రైతులు సంప్రదాయంగా వస్తున్న పసుపును వదులుకోలేక సాగును కొనసాగిన్నారు. ఇతర పంటలకు మళ్లిన రైతులు కూడా ఎంతో కొంత విస్తీర్ణంలో పసుపును నాటుతూ వస్తున్నారు.


