పోలీసు కమిషనరేట్‌గా గుంటూరు | - | Sakshi
Sakshi News home page

పోలీసు కమిషనరేట్‌గా గుంటూరు

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

పోలీసు కమిషనరేట్‌గా గుంటూరు నేడు నృసింహుడి ఆలయంలో వరుణ హోమం జేఎన్‌టీయూఎన్‌ ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ఆర్‌.రాజేశ్వరరావు మంత్రి లోకేష్‌ను కలిసిన ఆర్చర్‌ జ్యోతి సురేఖ పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

నగరంపాలెం: గుంటూరు జిల్లా పోలీసు కమిషనరేట్‌గా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సోమవారం హోం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల గుంటూరు జిల్లా కమిషనరేట్‌గా తీర్మానిస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి కమిషనరేట్‌గా జిల్లాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి.

మంగళగిరిటౌన్‌: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంగళగిరి పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేకంగా వరుణ హోమం, వరుణ జపం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌ కుమార్‌ సోమవారం తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆలయంలో ఉదయం 6.45 గంటలకు వరుణ హోమం, వరుణ జపం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

నరసరావుపేటరూరల్‌: జేఎన్‌టీయూఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ఆర్‌.రాజేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేఎన్‌టీయూ కాకినాడలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రాజేశ్వరరావును ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించిన సిహెచ్‌ శ్రీనివాసరావును జేఎన్‌టీయూ కాకినాడకు బదిలీ చేశారు. కళాశాలలో విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించడం కోసం కృషి చేస్తానని నూతన ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజేశ్వరరావు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం, సాంకేతిక అభివృద్ధికి, పెండింగ్‌లో ఉన్న కళాశాల పనులకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. నూతన ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజేశ్వరరావుకు అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

తాడేపల్లిరూరల్‌: ప్రఖ్యాత ఆర్చర్‌ జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జ్యోతి సురేఖ జపాన్‌లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌–2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆర్చరీ కాంపౌండ్‌ మహిళా టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఏషియన్‌ గేమ్స్‌లో ఇప్పటి వరకు నాలుగు గోల్డ్‌ మెడల్స్‌ సహా ఆరు పతకాలు సాధించారు. సురేఖను మంత్రి నారా లోకేష్‌ అభినందించారు. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని సురేఖను మంత్రి నారా లోకేష్‌ ప్రశంసించారు. ఆర్చర్‌ జ్యోతి సురేఖతో పాటు ఆమె తండ్రి సురేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు సోమవారం 3,007 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 126 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌ 707, తూర్పు కాలువకు 471, పశ్చిమ కాలువకు 101, నిజాంపట్నం కాలువకు 303, కొమ్మమూరు కాలువకు 990 క్యూసెక్కులు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement