మద్యం సిండికేట్లకు మేలు చేసేందుకు ప్రభుత్వ తాపత్రయం లాభాల దుకాణాలు సిండికేట్లకు .. నష్టాలు ఇతర వ్యాపారుల నెత్తిన రుద్దే యత్నం! మిగిలిన షాపులకు దరఖాస్తు చేయకుంటే.. పాత బార్లు, వైన్స్‌లపై అక్రమ కేసులంటూ దౌర్జన్యం గడువు పెంచినా కానరాని ఆదరణ నేటితో ముగియనున్న మరో గడువు
నిబంధనల్లో గందరగోళం
నెహ్రూనగర్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం దుకాణాల నిర్వహణ వ్యవహారం సిండికేట్లకు అనుకూలంగా, చిన్న వ్యాపారులకు గొడ్డలిపెట్టుగా మారిందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మద్యం షాపులను సిండికేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ లాభాలు వచ్చే దుకాణాలను సిండికేట్ శక్తులు ఇప్పటికే రెన్యువల్ చేసుకోగా, వ్యాపారం సాగని, నష్టాలు వచ్చే షాపులను మాత్రం వదిలేసుకున్నారు. మిగిలిపోయిన దుకాణాలను బలవంతంగా వ్యాపారుల నెత్తిన రుద్దేందుకు ఎకై ్సజ్ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. టార్గెట్లు పూర్తి చేయాలన్న ఒత్తిడితో వ్యాపారులను కార్యాలయాలకు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్న తీరు తీవ్ర దుమారం రేపుతోంది.
కేసుల పేరుతో వేధింపులు..
నగరంలో ఎకై ్సజ్ శాఖ తీరుపై వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గుంటూరు నగరంలో సిండికేట్‌గా లాటరీ ద్వారా నాలుగు వైన్స్ దుకాణాలు దక్కించుకున్న ఓ వ్యాపారి, తీవ్ర నష్టా ల కారణంగా రెండింటిని రెన్యువల్ చేసుకోలేమని స్పష్టం చేసినా అధికారులు వినడం లేదు. ‘మిగిలిన షాపులకూ దరఖాస్తులు వేయాల్సిందే.. లేదంటే బార్లు, వైన్స్ షాపులపై కేసులు పెడతాం’ అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నష్టాల భయంతోనే వెనుకంజ
మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడానికి ప్రభుత్వం పెంచిన అడ్డగోలు రుసుములే ప్రధాన కారణమని కొంత మంది వ్యాపారులు చెబుతున్నారు. గత పాలసీతో పోలిస్తే 2025 నాటికి ఫీజు లను ఏకంగా 10 శాతం పెంచడంతో పాటు రెన్యువల్, పర్మిట్ రూమ్‌ల పేరుతో సర్కారు వ్యాపారుల రక్తాన్ని పిండుతోందని వాపోతున్నారు. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ.55 లక్షల నుంచి రూ.60.50 లక్షలకు పెంచారు. దీనికి తోడు రూ.23 లక్షల రెన్యువల్ ఫీజు, రూ.5 లక్షల పర్మిట్ రూమ్ ఫీజు అదనంగా చేశారు. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న చోట్ల లైసెన్స్ ఫీజు రూ.65 లక్షల నుంచి రూ.71.50 లక్షలకు చేరింది. దీంతో పాటు రూ.27.20 లక్షల రెన్యువల్ ఫీజు, రూ.7.50 లక్షల పర్మిట్ రూమ్ ఫీజు చెల్లించాలి. 5 లక్షల పైబడిన జనాభా (గుంటూరు కార్పొరేషన్ పరిధిలో) గతంలో రూ.85 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును రూ.93.50 లక్షలకు పెంచారు. దీనికి అదనంగా రూ.35.50 లక్షల రెన్యువల్ ఫీజు, రూ.7.50 లక్షల పర్మిట్ రూమ్ ఫీజు భరించాల్సి వస్తోంది. ఒక్క గుంటూరులోనే రెన్యువల్‌కు రూ. 1.36 కోట్ల దాకా ఖర్చు అవుతున్న నేపథ్యంలో వ్యా పారులు రెన్యువల్ చేసుకోలేదు. మిగిలిపోయిన షాపులకు రెన్యువల్ ఫీజు లేదు కాబట్టి ఎలాగైనా దరఖాస్తులు వేయాల్సిందేనని అధికా రులు వీరిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. భారీ మొత్తాలను పెట్టుబడిగా పెట్టి చివరకు అప్పులపాలు కావడం తప్ప లాభాలు రావని గుర్తించే వ్యాపారులు దుకాణాలను వదిలేసుకుంటున్నారు.
గుంటూరు జిల్లాలో మొత్తం 138 షాపులకు గాను కేవలం 91 మాత్రమే రెన్యువల్ అయ్యాయి. మిగిలిన 47 షాపులతో పాటు గతంలో ఆగిపోయిన రెండు షాపులు కలిపి మొత్తం 49 దుకాణాలకు ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి వరకు లాటరీ దరఖాస్తుల గడువు ఇచ్చారు. అటు పల్నాడు జిల్లాలో 142 షాపుల్లో 118 రెన్యువల్ కాగా, మిగిలిన 24 షాపులను లాటరీకి ఉంచారు. అయితే, లాటరీ తీయడానికి ఒక్కో దుకాణానికి కనీసం 4 దరఖాస్తులు వస్తే చాలని ప్రభుత్వ గెజిట్ చెబుతుంటే, 10 దరఖాస్తులు తప్పనిసరి అని స్థానిక అధికారులు చెబుతుండటంతో వ్యాపారులు అయోమయంలో పడ్డారు. ఫలితంగా 1వ తేదీ వరకు గుంటూరు జిల్లాలోని 49 షాపుల్లో కేవలం 18 షాపులకు మాత్రమే, పల్నాడు జిల్లాలోని 24 షాపుల్లో కేవలం 2 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆశించిన స్పందన లేకపోవడంతో చేసేది లేక దరఖాస్తు గడువును ఈ నెల 6వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకు పొడి గిస్తూ ప్రభుత్వం మళ్లీ ఆదేశాలు జారీ చేసింది.


