గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది విధులు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు సోమవారం ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, జిల్లా కలెక్టర్‌కు, టీచింగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు, డీఎంహెచ్‌ఓకు కాంట్రాక్టు వైద్య సిబ్బంది వినతిపత్రాలు అందజేశారు. ఆగస్టు నెల నుంచి కాంట్రాక్టు వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులరయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, హెల్త్ కార్డు ఇవ్వాలని, సెలవులు మంజూరు చేయాలని పలు డిమాండ్‌లతో రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినప్పటకీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఈనెల 4న పెన్‌డౌన్, ఆన్‌లైన్ వర్క్స్ నిలుపుదల చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌లకు వినతి పత్రం అందజేశారు. గుంటూరు జీజీహెచ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం కేవలం అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతామని యూనియన్ నేతలు తెలిపారు. బుధవారం నుంచి అత్యవసర వైద్య సేవలు కూడా బహిష్కరించి పూర్తి స్థాయి బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. కాంట్రాక్టు నర్సింగ్‌సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ అధికారులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది, బంద్‌లో పాల్గొంటున్నారు. కాగా జిల్లాలో ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది సమ్మెలోకి వెళుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మక్కెన పద్మావతి తెలిపారు.


