కేసుల రాజీలో కమ్యూనిటీ మధ్యవర్తుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

కేసుల రాజీలో కమ్యూనిటీ మధ్యవర్తుల పాత్ర కీలకం

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

గుంటూరు లీగల్‌: కేసుల రాజీలో కమ్యూనిటీ మధ్యవర్తుల పాత్ర కీలకమని ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్‌ వీఏఎల్‌ సత్యవతి పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని కమ్యూనిటీ మధ్యవర్తులకు శిక్షణ కార్యక్ర మం సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నియమింపబడిన ప్రధాన శిక్షకుడు ఎస్‌.అరుణాచలం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాద్దీన్‌తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లా డుతూ జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వ్యాజ్యలు లేని గ్రామీణ భారతదేశంపై రెండు రోజుల శిక్షణ ఉంటుందని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ మాట్లాడుతూ కమ్యూనిటీ మధ్యవర్తి అంటే గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలకు కేవలం ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యక్తి తరపునే మాట్లాడటం కాదని ఇరుపక్షాల వాదనలు, సమస్యలు తెలుసుకొని ఎవరో ఒకరిని గెలిపించడం కాకుండా ఇరుపక్షాల మధ్య శాంతిని తిరిగి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కమ్యూనిటీ మధ్యవర్తులందరూ సమాజానికి శాంతి దూతలాంటివారని, ప్రజల మధ్య వివాదాలు వచ్చినప్పుడు సాధ్యమైన చోట ముందుగా సంభాషణకు, పరస్పర అవగాహనకు, శాంతియుత పరిష్కారానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఇతరుల బాధలను అర్ధం చేసుకునే మనస్సు, ఓపిక, నిజాయతీ ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు మీ మాటలను నమ్మి వారి సమస్యలను మీతో చెప్పుకునే విధంగా ఉండాలన్నారు. సమస్యలను రహస్యంగా ఉంచుతారనే నమ్మకం ప్రజలకు కలిగించాలని చెప్పారు. మధ్యవర్తి సమస్యకు తీర్పు చెప్పడం కాదని, వారి మధ్య ఉన్న అపార్ధాలను తొలగించాడనికి ప్రయత్నించాలన్నారు. సమస్యకు పరిష్కారం ఏమిటో వారే గుర్తించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రధాన శిక్షకులు ఎస్‌.అరుణాచలం మాట్లాడారు. కార్యక్రమంలో వసుమతి పూర్ణిమ, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

ఒకటవ అదనపు జిల్లా జడ్జి సత్యవతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement