మంగళగిరి టౌన్: స్థలం లేకుండానే ఉన్నట్లు చూపించి మోసగించిన నిందితులను పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. మంగళగిరి పట్టణం భార్గవపేటకు చెందిన చౌడేశ్వరి, భర్త వెంకటేశ్వరరావు టైలర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి పిల్లలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. 2025 నవంబర్‌లో మంగళగిరి పట్టణానికి చెందిన యేసు అనే తెలిసిన వ్యక్తి చౌడేశ్వరి ఇంటికి వచ్చి తక్కువలో స్థలం అమ్మకానికి ఉందని నమ్మబలికాడు. గౌరీశంకర్, సునీల్, మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తులను యేసు వెంటబెట్టుకుని మంగళగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ పక్కన 300 గజాల స్థలం అమ్మకానికి ఉందని చూపించారు. దాని విలువ రూ.93 లక్షలు ఉంటుందని చెప్పగా విక్రయ అగ్రిమెంట్, విక్రయ బయానా రశీదు, తయారు చేసిన స్టాంప్ పేపర్లు కూడా తీసుకొచ్చారు. అదే రోజుల లక్ష రూపాయలు నగదు ఇవ్వగా బయానా రశీదు ఇచ్చారు.
స్థలాన్ని కొనుగోలు చేసేందుకు బ్యాంకులో రుణం కోసం డాక్యుమెంట్లను తీసుకెళ్లగా, బ్యాంకు అధికారులు పరిశీలించి ఈ స్థలానికి ఎలాంటి బ్యాంకు లోన్ రాదని చెప్పారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అప్పటికే మొత్తం అగ్రిమెంట్ తాలూకా అడ్వాన్స్ కింద రూ.15 లక్షలు ఇచ్చారు. డాక్యుమెంట్ పూర్తి వివరాల కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వాళ్లు ఇచ్చిన డాక్యుమెంట్‌ను పరిశీలించమని చెప్పగా మంగళగిరి రెవెన్యూ తాలూకా డి–223/ఎ సర్వే నెంబర్‌లో 300 చదరపు గజాల స్థలం లేదని అధికారులు చెప్పారు. దీంతో వారిని నిలదీయగా మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారు. లేని స్థలాన్ని ఉన్నట్లు చూపించారని, మోసపోయామని గ్రహించిన బాధితురాలు చౌడేశ్వరి జూన్ 28న మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళగిరి పట్టణ సీఐ వీరాస్వామి పర్యవేక్షణలో ఎస్‌ఐ రవీంద్రనాయక్, సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆదివారం ఇందిరానగర్ సెంటర్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. 15 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుని మోసం చేసిన నిందితులు మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు, గౌరీశంకర్, ఏసులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి సునీల్ పరారీలో ఉన్నాడని, అతడ్ని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని పట్టణ సీఐ వీరాస్వామి తెలిపారు.


