పోలీసులపై న్యాయ పోరాటం | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై న్యాయ పోరాటం

Aug 4 2026 1:23 AM | Updated on Aug 4 2026 1:23 AM

పోలీసులపై న్యాయ పోరాటం

హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేస్తాం పోలీసుల వెనుక ఎవరున్నదీ తేలుస్తాం రెండు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ముస్తఫాపై అక్రమ కేసు దారుణం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కేసుకు రాజకీయ రంగు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందని నూరిఫాతిమా గొంతు నొక్కే ప్రయత్నం మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

సంబంధం లేని కేసులో ఇరికించి వేధిస్తున్నారు

ముస్తఫా వ్యవహారంలో

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫాపై చంద్రబాబు ప్రభుత్వం మోపిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగుతున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ పొగాకు వ్యాపారితో నెలకొన్న లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, అతని కుమారుడు బషీర్‌పై నూజివీడు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు రాజకీయ రంగు పులిమిన ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. రూ.36 లక్షలు తీసుకుని సరుకు ఇవ్వకపోవడంతో వ్యాపారి కొడుకును సరుకుతో తీసుకొచ్చి, పెదకాకాని స్టేషన్‌లో అప్పగించిన ముస్తఫా తనయుడు బషీర్‌పై కిడ్నాప్‌ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ముస్తఫాతోపాటు అతని తనయుడు బషీర్‌పై కిడ్నాప్‌తో ఎస్సీ, ఎస్టీ కేసు, కిడ్నాప్‌ కేసు సైతం నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనార్టీ నేతపై వేధింపులు

తాడికొండ సర్పంచ్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ముస్తఫా వివాద రహితుడిగా గుంటూరు ప్రజలకు సుపరిచితుడేనని, అటువంటి ఆయనపై టీడీపీ సర్కారుకు కక్ష ఎందుకని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలిగా ఉన్న ముస్తఫా కుమార్తె షేక్‌ నూరి ఫాతిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆమె గళం విన్పించకుండా చేసేందుకు ప్రభుత్వం వారి కుటుంబంపై కక్ష కట్టిందని పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో నూరి ఫాతిమా ఇంటితో పాటు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారని, పెదకాకాని సీఐ నారాయణస్వామి నూరిఫాతిమా అపార్ట్‌మెంట్‌లోని సీసీ ఫుటేజ్‌ పట్టుకెళ్లారని అన్నారు. ముస్తఫా ఇంట్లో గంజాయి వంటి మత్తు పదార్థాలు పెట్టే ఆలోచనతో పోలీసులు పదే, పదే సోదాలు చేశారని విమర్శించారు.

పోలీసుల అతి ప్రవర్తనపై

హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌

పోలీసుల అతి ప్రవర్తనపై హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేస్తున్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తుల ఫొటోలు ప్రచురించిన విధంగా వ్యాపార లావాదేవీకి సంబంధించిన కేసులో ముస్తఫా, అతని కొడుకు పరారీలో ఉన్నారని, వారిని అప్పగిస్తే బహుమతి ఇస్తామంటూ నూజివీడు పోలీసులు ఎల్లో మీడియా పత్రికలో ప్రకటనం ఇవ్వడం దారుణమన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మైనార్టీ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం వెళ్లకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని, మహిళలను, బంధువులను బెదిరించడం దుర్మార్గమని అన్నారు. పోలీసులతోపాటు తెర వెనుక ఉండి నడిపిస్తున్న పెద్దలు ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారని అన్నారు. ఈనాడు పత్రిక ముస్తఫాపై ఇంత దిగజారి వార్తలు ప్రచురించడం పత్రికా లోకానికి సిగ్గు చేటన్నారు. ముస్తఫా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

కేంద్ర మంత్రి పెమ్మసాని నేరస్తుడు

కేంద్ర మంత్రి పెమ్మసాని నేరస్తుడని, అందుకే ఆయన మాట్లాడడని అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ డమ్మీలని, పోలీసు యంత్రాంగం పెమ్మసాని చేతుల్లో ఉందన్నారు. పెద్ద మనిషిలా చెలామణీ అవుతూ తడి గుడ్డలతో గొంతులు కోస్తున్నారనీ, టీడీపీ గుండాలను పంపి, పోలీసులను అడ్డుకోవద్దని పెమ్మసాని చెప్పడంతోనే నా ఇల్లు, కార్యాలయాలపై ఏడు గంటలపాటు విధ్వంసం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారితోపాటు సూత్రధారులకు సంకెళ్లు వేయించే వరకు నిద్ర పోనని స్పష్టం చేశారు. తన ఇంటిపై దాడి జరిగిన రోజు సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీకి ఫోన్లు చేయలేదని పెమ్మసాని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను చేసిన ఆరోపణలు అబద్ధం అని పోలీసులు చెప్పలేదన్నారు.

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే షేక్‌ ఎండీ ముస్తఫాను సంబంధం లేని కేసులో ఇరికించి, మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి ప్రతిరోజూ స్టేషన్‌కు రమ్మని పిలవడం, కోర్టు ఆర్డర్‌ లేకుండా ఇంట్లో తనిఖీలు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు పఠాన్‌ సైదా ఖాన్‌, తూర్పు. పశ్చిమ నియోజకవర్గాల మైనార్టీ సెల్‌ అధ్యక్షులు లియాకత్‌ అలీ, ఖాసిం బేగ్‌, మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షారుఫుద్దీన్‌, కార్యదర్శి ఉమర్‌, ఈసీ సభ్యుడు బషీద్‌, ఖాజావలి, పలావ్‌ సైదా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement