జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ పీజీఆర్‌ఎస్‌లో 420 అర్జీలు స్వీకరణ
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో పాటు వేగవంతంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జేసీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని జేసీ స్పష్టం చేశారు. అనంతరం వచ్చిన 420 అర్జీలను డీఆర్‌ఓ షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డీపీఓ సాయి కుమార్, జిల్లా అధికారులు పరిశీలించారు.


