తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదం దాడికి దారి తీసింది. పట్టణ ఐతానగర్‌కు చెందిన వల్లభాపురపు మాణిక్యరావు(రౌడీషీటర్), సుబ్బారావు రాత్రి వేళల్లో ఆటో నడుపుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్లాంపేట/ముత్తెంశెట్టిపాలేనికి బాడుగ రాగా వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కబేళా వంతెన మార్గంలో అప్పుతే నరసరావుపేట నుంచి వచ్చి కారుకు కవర్ వేస్తున్న సుల్తాన్(రౌడీషీటర్)ను ఢీకొట్టారు. ముందుకు పడిన సుల్తాన్ ముక్కుకు తీవ్ర గాయమైంది. ఆటోను ఆపకుండ వెళ్లిపోవడంతో సుల్తాన్, అతడి మిత్రులు, బంధువులు బైక్‌లపై వెంబడించారు. ఐతానగర్‌లో ఆటోను అడ్డగించి మాణిక్యరావు, సుబ్బారావులపై కర్రలు, రాడ్డులతో దాడి చేశారు. దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుండి మాణిక్యరావును గుంటూరు వైద్యశాలకు పంపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మాణిక్యరావుపై సెక్షన్ 279 కింద ఆదివారం రాత్రి కేసు నమోదైంది. అలానే సుల్తాన్, మరి కొందరిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా మాణిక్యరావు, సుబ్బారావు మద్యం తాగి ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజానికి వినోదాత్మకంగా మంచి సందేశాన్ని అందించాలనే సంకల్పంతో అమీర్ లోగ్ చిత్ర బృందం చేసిన ప్రయత్నం ఎంతో అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ అన్నారు. ఆదివారం గోరంట్లలోని భాష్యం టెన్త్ క్యాంపస్ థియేటర్‌లో అమీర్ లోగ్ చిత్రంలోని కాసుల కళ గీతాన్ని భాష్యం రామకృష్ణ ఆవిష్కరించారు. రామకృష్ణ మాట్లాడుతూ చిత్ర దర్శకుడు రమణారెడ్డికి ఒక ఆర్కిటెక్చర్‌గా భాష్యం విద్యాసంస్థలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆయనలోని సృజనాత్మకతను వెలికితీస్తూ చిత్రాన్ని నిర్మించడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని, సీని రంగంలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిత్ర నటీనటులు, కో–ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి, సంగీత దర్శకులు స్మరణ్ సాయి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్, డీఓపీ ఎస్‌వీకే, గీత రచయిత మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించిన రవీంద్ర రెడ్డి
ప్రత్తిపాడు: క్యారమ్స్ పోటీల్లో ప్రత్తిపాడు కుర్రాడు సత్తా చాటాడు. నెల్లూరులో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఏపీ 1వ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ – 2026 రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఏపీ క్యారమ్స్ అసోసియేషన్, జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్వహించిన చాంపియన్ షిప్ పోటీల్లో ప్రత్తిపాడుకు చెందిన క్యారమ్స్ ప్లేయర్ బాపతు రవీంద్ర రెడ్డి గుంటూరు జిల్లా నుంచి పాల్గొని ఉత్తమ ఆటతీరును కనబరిచాడు. రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించాడు. అసోసియేషన్ ప్రతినిధులు రవీంద్ర రెడ్డికి ట్రోఫీ, సర్టిఫికెట్ అందజేశారు. గతంలోనూ రవీంద్ర రెడ్డి అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు సాధించాడు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు క్యారమ్స్ ఆటగాళ్లు, యువత, గ్రామస్తులు రవీంద్ర రెడ్డికి అభినందనలు తెలిపారు.
నరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకుగాను పది మండలాల్లో 77.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆదివారం సంబంధిత అధికారులు వెల్లడించారు. రెంటచింతల 3.6 మి.మీ, గురజాల 9.8, దాచేపల్లి 1.6, నరసరావుపేట, మాచవరం మండలాల్లో 1.8 చొప్పున, అచ్చంపేట 15.2, క్రోసూరు 2.6, అమరావతి 12.8, పెదకూరపాడు 22.0, రాజుపాలెం 2.2, ముప్పాళ్ల 4.2, మీ.మీ. వర్షం కురిసింది.


