రేపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న టైప్‌రైటింగ్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఎగ్జామినేషన్ చీప్ సూపరింటెండెంట్ కే.మల్లికార్జునరావు మాట్లాడుతూ శని, ఆదివారాలలో జరిగిన పరీక్షకు నూరువాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు. రెండవ రోజు పరీక్షకు ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్‌కు ఏడు, లోయర్ గ్రేడ్‌కు 16, హయ్యర్ గ్రేడ్‌కు ఏడు, తెలుగు హయ్యర్‌కి ఇరువురు మొత్తం 32 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
మార్టూరు: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై కోలలపూడి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. హైవే అంబులెన్సు సిబ్బంది నాయక్, స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. కోలలపూడికి చెందిన యార్లగడ్డ ఆదెమ్మ(70) ముప్పవరం నుంచి కోలలపూడి కూడలి వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్లడం కోసం రహదారి దాటుతోంది. ఈ క్రమంలో అదే మార్గంలో కోలలపూడి వైపు వెళ్తున్న ఆటో ఆదెమ్మను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో ఉన్న ఆదెమ్మను హైవే అంబులెన్స్ సిబ్బంది నాయక్ మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆదెమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆదెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు ఆదెమ్మకు భర్త, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు పట్టించినట్లు సమాచారం.
వేటపాలెం: బైక్ పై వెనుక కూర్చొన్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేటపాలెం–చీరాల రోడ్డులో ఆమోదగిరిపట్నం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వేటపాలెం మార్కెట్ సెంటర్ వద్ద గోలి గోపి(36) నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పి తన పక్కింటి అతని సహాయంతో మోటార్ బైక్ పై చీరాల హాస్పిటల్‌కి వెళుతున్నాడు. ఆమోద గిరిపట్నం వద్దకు వెళ్లే సరికి బైక్ వెనుక వైపు కూర్చునొని ఉన్న గోపీకి ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి కింద పడి పోయాడు. బైక్ ఆపి చూడగా గోపీ మృతి చెంది ఉన్నాడు. బైక్ వెనకూర్చుని ఉన్న సమయంలో ఫిట్స్ రావడంతో కింద పడి మృతి చెందాడని భావిస్తున్నారు. గోపీ వేటపాలెం సెంటర్లో కర్రీ పాయింట్ నిర్వహిస్తుంటాడు. భార్య, ఒక కూతురు ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్సై పి.జనార్దన్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నాడు.


