కాపు నేతపై తమ్ముళ్ల కక్ష | - | Sakshi
Sakshi News home page

కాపు నేతపై తమ్ముళ్ల కక్ష

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

కాపు నేతపై తమ్ముళ్ల కక్ష ● ప్రత్తిపాడు నియోజకవర్గం ముట్లూరులో ఇటీవల జనసేనకు చెందిన కాపు యువకులను టార్గెట్‌ చేసి దాడులు చేశారు. ఊరి శివారు నుంచి గ్రామ నడిబొడ్డు వరకూ కాపులను కొట్టుకుంటూ వచ్చి రెచ్చిపోయారు. చివరికి విషయం కాపు సంఘ నేతల వద్దకు చేరడం, వారు కేంద్ర మంత్రి వద్ద పంచాయితీ చేయడంతో ఎట్టకేలకు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ ప్రజాప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం వెనుక కూడా గాదె వెంకటేశ్వరరావు గట్టిగా నిలబడ్డారన్న అసంతృప్తి తెలుగుదేశంలో ఉంది. ● కొల్లూరులో నూడిల్స్‌ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న జనసైనికుడు ఉప్పు జానకీరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్‌ ప్రసాద్‌ను విమర్శించాడన్న సాకుతో దాడి చేశారు. తలకు గాయమైన వెంటనే తన బంధువులు, స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు కొల్లూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన జానకి రామయ్యను పోలీసులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అతనిని తెనాలి తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో పోలీసు స్టేషన్‌ను ఆనుకొని ఉన్న ఎస్సీ ఏరియా నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు పోలీసుస్టేషన్‌పై దాడికి దిగారు. పోలీసులతోపాటు, బాధితుడు జానకిరామయ్య, వారి బంధువులపై విచక్షణరహితంగా దాడి చేశారు. ఆఖరికి పోలీసుల జీపును కూడా తగులబెట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ‘కాపు నా కొడుకులు కనపడితే కొట్టండి’ అంటూ తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయారు. ఈ సంఘటనపై కూడా గాదె వెంకటేశ్వరరావు తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకుతీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, దాడులు చేయడం వంటి దుశ్చర్యలను మానుకోకపోతే తరువాత జరిగే పరిణామాలను ఊహించుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు ఎవ్వరూ ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన జిల్లా అధ్యక్ష పదవి నుంచి గాదె వెంకటేశ్వరరావును తప్పించేందుకు ప్రయత్నాలు తెలుగుదేశం ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించినందుకేనా? కాపులపై దాడులకు స్పందించడంతో పెమ్మసానికి ఎమ్మెల్యేల ఫిర్యాదు గాదె స్థానంలో బీసీ నేతకు అవకాశం జనసేనలో చర్చనీయాంశంగా జిల్లా అధ్యక్షుడి మార్పు వ్యవహారం

ఫిర్యాదుతోనే తొలగింపు?

సుగాలి ప్రీతి తల్లి ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేసినప్పుడు ఆ పార్టీ తరఫున స్పందించిన నాయకుడు ఆయన. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన కోసం నిలబడింది కూడా ఆయనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అవినీతిని, జనసేన పార్టీకి చెందిన కాపులపై జిల్లాలో జరుగుతున్న దాడులపై ప్రశ్నించడమే ఆయనకు శాపంగా మారింది. జనసేన జిల్లా అధ్యక్షునిగా ఉన్న గాదె వెంకటేశ్వరరావుకు ఉద్వాసన పలికి ఆయన స్థానంలో మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాసరావు, గంజి చిరంజీవిలలో ఒకరిని జిల్లా అధ్యక్షునిగా చేయాలని నిర్ణయించారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గాదె వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసే ఆయన జనసేన పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ జెండాను భుజాన మోస్తూ వచ్చారు. పార్టీ కోసం ఇప్పటి వరకూ జిల్లాలో నిలబడిన చరిత్ర ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మిర్చి యార్డు చైర్మన్‌ పదవి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. దాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కుర్రా అప్పారావుకు ఇచ్చారు. నామినెటేడ్‌ పదవుల్లో కూడా చోటు దక్కలేదు. అయినా అసంతృప్తి చెందకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే ఇటీవల జనసేన పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తి మొదలైంది. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో కొంతమేర జనసేనకు సమాచారం ఇచ్చి చేసినా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పునర్విభజన ప్రక్రియలో కనీస సమాచారం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేను అడిగినా పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనిపై గట్టిగా నిలదీశారు. గుంటూరు నగరంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో 28 రోడ్లు వేయాలని ప్రతిపాదనలు ఇవ్వగా, ఒక్కటీ ఆమోదించకపోవడంపై కూడా ఎమ్మెల్యేని నిలదీశారు. అంబటి రాంబాబుపై అక్రమలు కేసులు మోపి జైలులో పెట్టిన వ్యవహారంలో కూడా రాంబాబును జైలులో ఉంచడానికి జనసేన తరఫున తాను 2022లో ఇచ్చిన ఫిర్యాదును బయటకు తీసుకొచ్చారు. తమను ఇబ్బంది పెట్టారన్న భావన కూడా గాదె వెంకటేశ్వరరావులో ఉంది.

కాపు నేతలే లక్ష్యంగా...

ఓబులనాయుడుపాలెంలో చిన్నారి క్వారీ గుంతలో పడి మృతి చెందడంపై గాదె వెంకటేశ్వరరావు తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఇక్కడ ఉన్న అటవీ శాఖ భూముల్లో కూడా అక్రమ మైనింగ్‌ చేస్తుంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలా గాదె వెంకటేశ్వరరావు ప్రతి విషయాన్ని నిలదీస్తుండటాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెళ్లి కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. దీంతో ఆయన జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో గాదెను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల పట్ల జనసేనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement