గుంటూరు వెస్ట్: జిల్లా ఎగుమతుల ప్రణాళిక పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక, బలోపేతానికి చేపట్టాల్సిన అంశాలను తయారు చేయాలని సూచించారు. తద్వారా విలువ ఆధారిత పెరుగుతుందని, తలసరి ఆదాయంలో వృద్ధి వస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కోసం ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలో అనవసర ప్రక్రియ అనే విధానాన్ని ప్రభుత్వం తొలగించి మరింత సులభతరం, వేగవంతం చేసిందని వివరించారు. కనీస తనిఖీలు విధానంలో ప్రభుత్వం పాలసీ తీసుకువచ్చి ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమం అనంతరం సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ఆర్జీలు స్వీకరించాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పాలసీ కింద 1,848 దరఖాస్తులు అందాయని, అందులో 1,827 నిర్ణీత గడువులోగా పరిష్కరించామని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలో చేపట్టిన వివరాలు తెలిపారు. ఇ కామర్స్‌పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసినవారికి రూ.83 లక్షల ప్రోత్సాహకాలను కమిటీ ఆమోదించింది. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహేంద్రపాల్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్, వివిధ ఆర్థిక సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ


