కొరిటెపాడు(గుంటూరు): టెక్స్‌టైల్ పరిశ్రమకు అండగా ఉంటానని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులోని ఓ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. టెక్స్‌టైల్ రంగంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసోసియేషన్ నాయకులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఇప్పటికే సుమారు రూ.500 కోట్ల సబ్సిడీని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న రూ.50 కోట్ల క్లెయిములను త్వరలో విడుదలయ్యేలా చేస్తామని పేర్కొన్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఏపీలోనూ గ్రీన్ ఎనర్జీ పాలసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. టెక్స్‌టైల్ పరిశ్రమను పరిశ్రమల శాఖ పరిధిలోకి బదిలీ అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. పత్తి కొనుగోలు, సీసీఐ, విద్యుత్ సమస్యలపై లోతుగా చర్చించామని, పరిశ్రమకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారం చిరస్మరణీయమని, భవిష్యత్‌లోనూ ఆయన మార్గదర్శకత్వం కావాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ను అసోసియేషన్ నాయకులు సత్కరించారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు కోటి రావు, సత్యనారాయణ, వీర నారాయణ, బ్రహ్మానందం పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్


