నగరంపాలెం:గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్‌లోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మంగళవారం ఏపీ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. సంఘం రాష్ట్ర కోశాధికారి డాక్టర్ కేవీ.నారాయణ (విశ్రాంత డీఎస్పీ), శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా యూనిట్ కోశాధికారి ఎల్.ప్రభాకరరావు (విశ్రాంత డీఎస్పీ) సంబంధించి సమస్యలపై వినతిపత్రాలు అందించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ తెలిపారు. విశ్రాంత డీఎస్పీల సమస్యలపై గుంటూరు రేంజ్ ఐజీ సానుకూలంగా స్పందించారని అన్నారు. అనంతరం ఐజీని సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి డాక్టర్ కె.వి.నారాయణ, కార్యవర్గ సభ్యుడు బి.వి.సుబ్బారెడ్డి (విశ్రాంత డీఎస్పీ), సభ్యుడు వై.టి.నాయుడు (విశ్రాంత ఎస్పీ) పాల్గొన్నారు.
నగరంపాలెం: గృహ ఎల్‌పీజీ సిలిండర్లను వినియోగించే వ్యాపార దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల పరిధిలోని గొల్లపాలెం రోడ్డులో ఉన్న బాలాజీ మెస్‌లో ఆరు సిలిండర్లు, మసీద్ సెంటర్‌లోని మస్తాన్ బాబా ముబారక్ హోటల్‌లో ఎనిమిది గృహ ఎల్‌పీజీ సిలిండర్లను గుర్తించారు. అక్రమంగా వినియోగిస్తున్న 14 సిలిండర్లను స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించారు. ఆయా హోటళ్ల యాజమానులపై రెండు 6–ఎ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్‌న్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని మోటార్ సెక్షన్, బెల్‌ఆఫ్‌ఆర్మీ సెక్షన్, డాగ్ కెన్నెల్స్, యూనిట్ హాస్పిటల్, పోలీస్ క్యాంటిన్, కమ్యూనికేషన్, టైలరింగ్ సెక్షన్ విభాగాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి విభాగంలో శుభ్రత, నిర్వహణ ప్రమాణాలు మెరుగుపరచాలని అన్నారు. ఆయుధాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్కార్ట్ డ్యూటీలు, గార్డ్ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. పోలీస్ డాగ్‌స్క్వాడ్ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్) డిఎస్పీ సంకురయ్య, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, శివరామకృష్ణ పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.76.38 లక్షల నగదును కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు. కానుకలను సోమవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో గ్రూపు ఆలయాల ఈఓలు సీహెచ్ జయప్రకాష్‌బాబు, బీవీ సుబ్బారావు, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు పర్యవేక్షించారు.


