ఇక అధికారుల చేతుల్లోకి పగ్గాలు ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తున్న సర్పంచుల శకం తెరపైకి రానున్న అధికారుల పాలన జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికల అవకాశాలు
యడ్లపాడు : రాష్ట్రంలోని స్థానిక సంస్థల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల బాటలోనే ఇప్పుడు గ్రామ పంచాయతీలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ రెండో తేదీతో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా లేకపోవడంతో పాలనా పగ్గాలను అధికారులకు అప్పగించే ప్రక్రియ దాదాపుగా వేగవంతమైంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మేజర్ పంచాయతీలకు మండలస్థాయి అధికారులను, ఇతర గ్రామాలకు ఆ స్థాయికి తగ్గని అధికారులను ప్రత్యేక పాలకులుగా నియమించేందుకు కసరత్తు పూర్తయినట్లు సమాచారం.
గత ఎన్నికల నేపథ్యం.. విభజన తర్వాత
మారుతున్న సమీకరణాలు
గత ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలిస్తే.. 2021 ఫిబ్రవరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 973 గ్రామ పంచాయతీలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఫలితాలు వెల్లడైన వెంటనే సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, సాంకేతిక కారణాలతో వారి పదవీకాలం ఏప్రిల్ 2 నుంచి లెక్కించబడింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 అర్ధరాత్రి వరకు మాత్రమే వారికి అధికారికంగా హోదా దక్కనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని 56 గ్రామాల్లో గతంలోనే ఎన్నికలు జరగలేదు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం కావడం, మరికొన్ని గ్రామాలు నగర పంచాయతీలుగా మారడం, ఇంకొన్ని చోట్ల కోర్టు కేసులు అడ్డంకిగా మారడం వల్ల సుదీర్ఘ కాలంగా అక్కడ ప్రజాప్రతినిధుల పాలన కరువైంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ గందరగోళం మరింత పెరిగిందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతోంది.
అప్పుల ఊబిలో సర్పంచులు..
మరోవైపు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోతున్న తరుణంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అధికారిక హోదా ఉన్నప్పుడే నిధులు రాబట్టుకోలేకపోయిన తాము, పదవి నుంచి దిగిపోయాక కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న సందేహం వారిలో వ్యక్తమవుతోంది. సొంత నిధులు వెచ్చించి పనులు చేసిన వారు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రతికూల నివేదికల నేపథ్యంలో, ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం నిధుల విడుదలపై కూడా స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది.
అధికారుల చేతుల్లోకి పల్లె అధికారం
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల విషయంలోనూ ఇదే తరహా అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాలని, కుల గణన నిర్వహించాల్సి ఉందని ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఎన్నికల వాయిదాకే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. వివిధ సంక్షేమ పథకాల అమలులో తలెత్తుతున్న ఇబ్బందులు, సామాన్య ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, ప్రస్తుతానికి ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా నష్టదాయకమని టీడీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. మొత్తంమీద గ్రామీణ స్థాయిలో స్వపరిపాలనకు తాత్కాలికంగా విరామం లభించి, ప్రత్యేక అధికారుల చేతుల్లోకి అధికారం బదిలీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.


