పెదకాకానిలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

పెదకాకానిలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. టీడీపీ నాయకులు సిఫార్స్‌లు చేస్తే చాలు రికార్డులు తారుమారు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌లు మంజూరు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా భూముల రికార్డులు మార్చేస్తున్నారు. ఈక్రమంలో నెలల తరబడి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన పెదకాకాని గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి(బుల్లెమ్మ) దంపతులకు బెజవాడ గణపతి, సుబ్రహ్మణ్యం, సీతారామాంజనేయులు నలుగురు సంతానం. వారిలో చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌(ఎఫ్‌ఎంబీ) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతో పాటు చుట్టు పక్కల వారిని విచారించిన రెవెన్యూ అధికారులు కృష్ణమూర్తి ఒక్కడే సంతానం అని ఎఫ్‌ఎంబీ మంజూరు చేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఒక్కడి పేరిటే ఎఫ్‌ఎంబీ ఇచ్చారని తెలుసుకుని తహసీల్దార్‌ను ఆశ్రయించారు. బెజవాడ సాంబయ్యకు నలుగురు సంతానం ఉండగా ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని మిగిలిన ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కూడా చేర్చాలని, లేని పక్షంలో రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.

● 2025, జనవరి నెలలో తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తిరిగి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ ద్వారా అదే నెలలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాకపోగా ఆ ఎఫ్‌ఎంబీ ఆధారంగా తల్లి పేరిట సర్వేనెంబరు 228 బి లో ఉన్న భూమి 38 సెంట్లకు చిన్న కుమారుడైన కృష్ణమూర్తి పేరిట 1బి, అడంగల్‌ నమోదు చేశారు. సమస్యను పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్‌ నమోదు చేయడంపై మార్చి 10వ తేదిన మళ్లీ తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నలుగురు పేర్లు నమోదు చేసి ఎఫ్‌ఎంబీ ఇవ్వాలని, దాని ఆధారంగా ఇచ్చిన 1బి అడంగళ్‌ను రద్దు చేయాలని బాధితులు కోరుతున్నారు.

టీడీపీ నాయకులు ఫోన్‌ చేస్తే..

చేయాల్సి వచ్చింది

టీడీపీ నాయకుల సిఫార్సుల ఆధారంగా 1బి అడంగళ్‌ చేయాల్సి వచ్చిందని రెవెన్యూ అధికారి చెప్పడం దారుణంగా ఉందని బాధితుడు సీతారామాంజనేయులు దంపతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం సహకరించని వయసులో భార్యభర్తలం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరుతున్నారు.

రికార్డులు తారుమారు చేస్తున్న వైనం

నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంటర్‌ సర్టిఫికెట్‌

15 నెలలుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు

సమస్య పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్‌ మంజూరు చేసిన అధికారులు

టీడీపీ నాయకుడు ఫోన్‌ చేస్తే ఇచ్చామన్న ఆర్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement