గుంటూరు మెడికల్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తల, సెర్ప్ స్వయం సహాయక సభ్యులు 150 మందికి మాతృత్వ సంరక్షణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు రోజు సోమవారం ముఖ్య అతిథిగా ఎంసీహెచ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ గర్భిణులు సురక్షిత ప్రసవం కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఎక్సర్ సైజ్‌లు గురించి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్, మెలకువలు తెలుసుకొని, ఈ విషయాల మీద పట్టణ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో క్షేత స్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు. పరస్పర సహకారంతో తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, రాష్ట్ర మాతృత్వ, నవజాత శిశు, కౌమార బాలికల కన్సల్‌టెంట్ డాక్టర్ గవ్వల నాగేంద్ర, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, డీపీఎంఓ డాక్టర్ కె.సుజాత, డీపీహెచ్‌ఎంఓ ఇన్‌చార్జి డాక్టర్ ప్రియాంక, పెర్నాండేజ్ ఫౌండేషన్ శిక్షకులు డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రాం లీడర్ నీనా, ప్రాజెక్ట్ మేనేజర్ పాల్, పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్: మూడు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి ఏ. సలోమి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నకరికల్లు, నర్సింగపాడు, చేజర్ల గ్రామాలలో ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్‌లను అపహరించుకు వెళ్లినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నకరికల్లు పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటలోని శివ సంజీవయ్య కాలనీకు చెందిన తిరువీధుల శ్రీకాంత్, పుల్లలచెరువు మండలం అక్కపాలెం తందాకు చెందిన మేఘావత్ శ్రీను నాయక్, వినుకొండ మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన ధూపాటి చిన్న బాల లింగయ్య, నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన పాడిపర్తి నాగిరెడ్డి లను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.


