న్యూఢిల్లీ: వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రాణాంతకమైన మెదడు క్యాన్సర్‌ను నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక సంచలన విజయాన్ని సాధించారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన సరికొత్త ‘కార్-టీ సెల్ థెరపీ’ చికిత్సతో, కేవలం ఐదు రోజుల్లోనే ఒక రోగి మెదడులోని కణితి దాదాపుగా మటుమాయమయ్యింది.
ఏమిటీ ‘మ్యాజిక్’ థెరపీ?
సాధారణంగా గ్లియోబ్లాస్టోమా (Glioblastoma) అనేది అత్యంత వేగంగా వ్యాపించే, ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్. దీనికి చికిత్స అందించడం వైద్యులకు పెద్ద సవాలుగా ఉండేది. అయితే ‘CARv3-TEAM-E’ అనే సరికొత్త ప్రయోగాత్మక మందు పరిష్కారంగా మారింది. ఈ పద్ధతిలో రోగిలోని రోగనిరోధక కణాలను సేకరించి, వాటికి జన్యుపరమైన మార్పులు చేస్తారు. ఈ మార్పు చెందిన కణాలు నేరుగా క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేస్తాయి.
క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు
‘ఇన్సిపియంట్’ (INCIPIENT) పేరుతో నిర్వహించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో 57 నుండి 74 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు రోగులకు ఈ థెరపీని అందించారు. వీరందరూ ఇప్పటికే రేడియేషన్, కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలు పొంది, సరైన ఫలితాలను అందుకోలేకపోయారు. ఇప్పుడు ఒక రోగికి కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇవ్వగా, ఐదు రోజుల్లోనే కణితి దాదాపు పూర్తిగా కరిగిపోయింది. మరో రోగిలో.. ఆరు నెలల పాటు కణితి పరిమాణం 60 శాతం వరకు తగ్గింది. ఈ మందును నేరుగా మెదడులోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వైద్యులు గరిష్ట ఫలితాలను సాధించారు.
సవాళ్లు.. భవిష్యత్తు ఆశలు
ఈ చికిత్స పొందిన రోగులకు జ్వరం లాంటి కొన్ని సాధారణ దుష్ప్రభావాలు మినహా పెద్దగా ఇబ్బందులు కలగలేదు. అయితే ఈ థెరపీ వల్ల లభించిన ఫలితాలు ప్రస్తుతం తాత్కాలికంగానే ఉన్నాయి. కణాలు ఎక్కువ కాలం మెదడులో మనుగడ సాగించలేకపోవడం వల్ల కొంతకాలం తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీంతో మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం భవిష్యత్తులో క్యాన్సర్ రహిత ప్రపంచాన్ని నిర్మించే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి


