నేడు సన్నాహాక సమావేశం
తెనాలి: ప్రసిద్ధ ఆలయానికి సంబంధించిన ఉత్సవం జరిగే డొంక ప్రదేశాన్ని ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జరిగే సమావేశానికి వేలాదిగా హాజరుకావాలని పరిరక్షణ కమిటీ నాయకులు కోరారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండల గ్రామం గోవాడలో గల ప్రసిద్ధ శ్రీబాలకోటేశ్వరస్వామి దేవాలయంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాల్లో తిరునాళ్లకు లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. ఆ తిరునాళ్ల జరిగే డొంక ప్రదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కేటాయిస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్‌లో తిరునాళ్ల జరిపేందుకు తగిన స్థలం లేక, వేడుకలకు అవకాశం లేకుండాపోతుంది. దీనితో ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీని తెనాలిలో ఏర్పాటుచేశారు. భవిష్యత్ కార్యాచరణపై 29వ తేదీ ఉదయం 10 గంటలకు పెన్షనర్స్ హాలులో ఈ సమావేశం జరుపుతున్నట్టు కమిటి కన్వీనర్ కె.నందకిశోర్ చెప్పారు. అందరూ చర్చించుకుని భవిష్యత్ కార్యక్రమం చేపడతామని, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. దరిశి శివకోటేశ్వరరావు, కొడాలి శ్రీధర్, టి.జగదీష్, టి.అమరనాధ్, కేవీ సత్యనారాయణ, రావూరి శివశంకరరావు పాల్గొన్నారు.


