తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
● యూరియా పంపకంలో వివాదం
● కుర్చీలు, కంప్యూటర్లు ధ్వంసం
● పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదుతో
కేసు నమోదు
గుంటూరు రూరల్: తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎరువుల కోసం ఎగబడుతున్నారు. ప్రభుత్వం పంపిణీలో విఫలం చెందింది. తెలుగు తమ్ముళ్లు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులో మంగళవారం యూరియా పంపంకంలో చెలరేగిన వివాదం చివరికి కుమ్ములాటకు దారి తీసింది. రెండు గ్రూపులు పరస్పర దాడులు చేసుకున్నాయి. పంచాయతీ కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది.
క్యూ కట్టిన రైతులు
వింజనంపాడుకు 20 టన్నుల యూరియా వచ్చిందని తెలిసిన రైతులు పంచాయతీ ఆఫీసుకు క్యూ కట్టారు. గ్రామానికి చెందిన రైతు ముప్పవరపు శ్రీనివాసరావు పొలం పాస్ బుక్‌లు తీసుకుని పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. ఏఏవో రైతుల నుంచి పాస్‌బుక్‌లు చూసి ఎరువులను రాస్తున్నారు. గతంలో శ్రీనివాసరావు తీసుకున్నాడని, మరలా వచ్చాడని అదే గ్రామానికి చెందిన పొందూరి వెంకటేశ్వరరావు గొడవకు దిగాడు. ఇద్దరూ చెలరేగి కార్యాలయంలోనే కొట్లాటకు దిగారు. వారికి సర్ది చెప్పేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వివాదం మరింత పెరిగి కార్యాలయంలోని కంప్యూటర్లు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. సిబ్బంది పంపిణీ ఆపేయడంతో రైతులకు ఎరువు అందకుండా పోయింది.
విస్తుపోయిన అధికారులు
అధికారం చేతిలో ఉందని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కొట్లాటలకు దిగడంతో అధికారులు సైతం విస్తుపోయారు. కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసమైందని పంచాయతీ కార్యదర్శి శారద, మహిళా పోలీస్ రమ్య పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రమానాయక్ సిబ్బందితో అక్కడకు వచ్చి పరిస్థితిని గమనించారు. అధికారుల ఫిర్యాదు మేరకు ముప్పవరపు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. సరిపడా ఎరువులను సైతం అందించలేక రైతులపైనే కేసులు పెడతారా ? అంటూ గ్రామంలో పలువురు చర్చించుకుంటున్నారు.


