వైద్యుల మధ్య శత్రుత్వం తగదు
● ఐక్యతతో వృత్తిలో రాణించాలి
● జింకానా ప్రెసిడెంట్ డాక్టర్
కోయ రామకోటేశ్వరరావు
● గుంటూరు ప్రభుత్వ వైద్య
కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
● ఘనంగా వైట్ కోట్ సెర్మని
గుంటూరు మెడికల్: రోజురోజుకూ వృత్తిలో పోటీ పెరిగి వైద్యుల మధ్య శత్రుత్వం పెరుగుతోందని, యువ వైద్యులు కలిసికట్టుగా వృత్తిలో రాణించాలని జింకానా కో–ఆర్డినేటర్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ కోయ రామకోటేశ్వరరావు చెప్పారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా ఫ్రెషర్స్ డే , వైట్ కోట్ సెర్మనీ జరిగాయి. ముఖ్య అతిథిగా డాక్టర్ కోయ మాట్లాడుతూ ఒకరికొకరు సోదర భావంతో మెలగాలని తెలిపారు. విజ్ఞానం పెంచుకుని వృత్తిలో రాణించాలని సూచించారు. ప్రతి వైద్య విద్యార్థికీ జీవితంలో మరుపురాని రోజులా వైట్‌కోట్ సెర్మని నిలిచిపోతుందని చెప్పారు.
● గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ వైద్యులు అనైతిక పోటీకి వెళ్లకుండా ఎథిక్స్ పాటించాలని చెప్పారు.
● గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారీ మాట్లాడుతూ వైట్ కోట్ వేసుకోవడం ఫ్యాషన్ కాదని, అది బాధ్యతకు ప్రతీక అని చెప్పారు. కొత్తగా ధరించిన విద్యార్థులతో హిపోక్రటీస్ ప్రమాణం చేయించారు. వైద్య విద్యార్థులు వృత్తి విలువలు, నైతికతలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
● డాక్టర్ యశశ్వి రమణ, ముఖ్య అతిథి డాక్టర్ కోయ రామకోటేశ్వరరావులు విద్యార్థులకు వైట్ కోట్లు అందజేశారు. జింకానా అవార్డులను పలువురు రీసెర్చ్ వైద్యులకు అందజేశారు . కార్యక్రమంలో పలువురు బోధనా సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్‌కు స్వాగతం పలుకుతూ సీనియర్ వైద్యులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


