అమ్మవారికి గాజులతో అలంకరణ
తెనాలి: పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గాపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాస పౌర్ణమి సందర్భంగా మంగళవారం అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ఉయ్యాల సేవ చేశారు. దేవాలయంలో కనువిందుగా జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. పుచ్చ శైలజ భక్త బృందం ఆధ్వర్యంలో దేవస్థానం అర్చకులు రాఘవేంద్ర శివ వరప్రసాద్, ఆలయ ఈవో హరిప్రసాద్, వెంకన్న మాస్టారు పాల్గొన్నారు.
పెదకాకాని: స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వాహన పూజలు నిలిపి వేయనున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం, జ్వాలా తోరణ కార్యక్రమాలు నిర్వహించన్నుట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
కారెంపూడి: ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న పల్నాటి వీరారాధన ఉత్సవాల నిర్వహణపై గురజాల ఆర్డీఓ వి.మురళీకృష్ణ, ఇన్‌చార్జి డీఎస్పీ వెంకట నారాయణ మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలు జరగనున్న కారెంపూడిలో ట్రాఫిక్ సమస్యపై చర్చించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై కారెంపూడి సీఐ టీవీ శ్రీనివాసరావు వివరించారు. మంచినీరు, వైద్యం, పారిశుద్ధ్య పరిరక్షణ ఇతర సౌకర్యాల కల్పనపై కార్యాచరణను కారెంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీడీఓ జి. శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ కసిన్యా నాయక్ వివరించారు. సమావేశంలో పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ, పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ అధికారులు పాల్గొన్నారు.
అమ్మవారికి గాజులతో అలంకరణ


