జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
అఖిలభారత వడ్డెర సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్ ధ్వజమెత్తారు. బీసీల ఎదుగుదలను చంద్రబాబు ఓర్చుకోలేరని విమర్శించారు. గుంటూరు నగరంలోని నల్లచెరువులో ఉన్న సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ మద్యం కేసులో అసలు నిందితులైన వారి నుంచి ఉద్దేశ్యపూర్వకంగా మాజీ మంత్రి జోగి రమేష్ పేరును చెప్పించి, అరెస్ట్ చేయటం కేవలం కూటమి ప్రభుత్వ కుట్రేనన్నారు. దీనిపై బీసీ సంఘాలు, పెద్దలు పెద్ద ఎత్తున ఉద్యమించటంతో పాటు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల ఏడుకొండల స్వామి, సింహాచలం అప్పన స్వామి, కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు చనిపోయిన పాపం కూటమి ప్రభుత్వానికి తగులుతుందన్నారు. జోగి రమేష్ అరెస్ట్‌ను వడ్డెర సంక్షేమ సంఘం పూర్తిగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.


