
ఎరువుల విక్రయాలు నిలుపుదల
నగరంపాలెం: గుంటూరు పట్నంబజార్‌లోని బయో స్టిమ్యులేట్ ఎరువుల తయారీ షాపులు, ఇతర దుకాణాల్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆరు బృందాలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏడు టోకు వర్తకుల దుకాణాల్లో రూ.1.01 కోట్ల విలువైన ఎరువుల విక్రయాలు నిలుపుదల చేశారు. మరో పదమూడు రీటైల్ వర్తకుల దుకాణాల్లో రూ.26.10 లక్షల విలువైన బయో స్టిమ్యులేట్ అమ్మకాలు, పార్శిల్ సర్వీసెస్‌లో రూ.5.15 లక్షల విలువైన సరుకుకు సంబంధించి పత్రాలు చూపకపోవడంతో వాటి విక్రయాలు నిలుపుదల చేశారు. తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్‌రావు (గుంటూరు), టి.శ్రీనివాసరావు (మంగళగిరి), వి.కోటేశ్వరి (పొన్నూరు), ఆర్.విజయబాబు (తెనాలి), సీహెచ్ తిరుమలదేవి (పీటీఎల్), ఐ.సునీత (బీసీఎల్) పాల్గొన్నారు. అనుమతుల్లేకుండా ఎరువులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు.