
కేఎల్‌యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం శనివారం శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, కేఎల్‌యూ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్, వీసీ పార్థసారథి వర్మలతో కలిసి కాన్‌శాట్‌ను నింగిలోకి వదిలారు. తొలుత బెలూన్ సహాయంతో మొదటి కేఎల్ జాక్ శాటిలైట్‌ను పంపారు. అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్లలో కేఎల్ జాక్ శాటిలైట్ ఒకటి. ఉదయం 5.45 నిమిషాలకు కేఎల్ జాక్ శాటిలైట్‌ను పీకో బెలూన్ సాయంతో వదిలారు. కేఎల్ జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ సిహెచ్ కావ్యశ్రీ తెలిపారు. కేఎల్‌శాట్2ను ఫ్‌లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏటీసీ గన్నవరం ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ వచ్చిన తరువాత 6.45 గంటలకు బెంగళూరుకు చెందిన రెడ్‌వింగ్ అనే సంస్థ సహకారంతో ఫ్‌లైట్ మోడ్ డ్రోన్ సాయంతో నింగిలోకి పంపారు. శాటిలైట్ 1 గంట పాటు నిర్దేశిత కక్ష్యలో భూమి నుంచి సుమారు 12 కి.మీ. ఎత్తులో 60 కి.మీ. సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లీ లాండ్‌ప్యాడ్‌పై విజయవంతంగా దిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఈనెల 27న ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న మేక్‌ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పోటీల్లో కేఎల్‌యూ విద్యార్థులు రూపొందించిన కాన్‌శాట్ ఉపగ్రహం ఏపీ నుంచి ఎంపికై నట్లు పేర్కొన్నారు.
మార్టూరు: మండలంలోని ఇసుకదర్శి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వెంకట రమణయ్య (65) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిందట బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడ ఉదయం నిద్ర లేచేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం గమనించిన కుమార్తె స్వగ్రామంలో బంధువులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని సాయంత్రం అక్కడకు తరలించారు.