
నకిలీ మద్యం కుంభకోణం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లో జరిగిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఏడాదిన్నర కాలం పాలనలో రూ.కోట్లు దండుకున్నారని, తిరిగి వారే దొంగ.. దొంగ.. అని అరిచిన చందాన వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అన్నారు. గుంటూరులోని ఆయన తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డారన్నారు. దానిని వైఎస్సార్ సీపీ నేతలకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. జనార్దన్‌రావును అరెస్ట్ చేసిన తరువాత ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు జోగి రమేష్ పేరు చెప్పలేదని నిలదీశారు. ఆ తరువాత వీడియో రిలీజ్ కావటంలో ఉన్న ఆంతర్యం అందరికీ తెలుసున్నారు. జనార్దన్‌రావుతో ఒక వీడియో రికార్డ్ చేయించుకుని సోషల్ మీడియా ద్వారా టీడీపీ తొత్తులుగా ఉన్న చానల్స్ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్‌పై అభాండాలను వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనిని న్యాయవాదులుగా ఖండిస్తున్నామన్నారు. నకిలీ మద్యం కేసు కోర్టు విచారణలో ఉండగా, టీడీపీ వ్యక్తులు ఐవీఆర్‌ఎస్, ఫోన్‌కాల్స్ ద్వారా వైఎస్సార్ సీపీ నకిలీ మద్యం ఏ విధంగా తయారు చేసిందో, జనార్దనరావు మాటల్లో వినమని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎలా కాల్స్ వస్తాయని ప్రశ్నించారు. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర కాదా అని దుయ్యబట్టారు. దీనిపై సీబీఐ ఎంకై ్వరీ వేసి కోర్టు విచారణలో ఉన్న అంశంపై ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. +9179713 19649 నెంబర్ నుంచి తనకు కాల్ రావటం జరిగిందని, ఈ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి