
దేశం బలోపేతానికి ఎల్‌ఐసీ కీలకం
కొరిటెపాడు(గుంటూరు): ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ – మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభలు శనివారం స్థానిక ఎన్‌జీఓ కళ్యాణ మండపంలో జరిగాయి. జోనల్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల స్వదేశీ నినాదమిచ్చిన కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ఈక్విటీని వంద శాతానికి పెంచాలని నిర్ణయించడం దేశ ప్రయోజనాలకు హానికరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బీమా ఉద్యోగులు సంస్థలను కాపాడుకునేందుకు సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య, ఎల్‌ఐసీ ఆఫీసర్స్ ప్రధాన కార్యదర్శి కోటేష్ బాబు, డెవలప్మెంట్ అధికారుల కార్యదర్శి సురేష్ బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్, మహిళా కన్వీనర్ సీహెచ్ మధుబాల తదితరులు పాల్గొన్నారు.