
వసతిగృహాల ముఖచిత్రం మారాలి
గుంటూరు వెస్ట్: పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉండే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజినీరింగ్, సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల భవనాలు ఆహ్లాదకరంగా మారాలని సూచించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బీసీ సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలు సహా అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరిశుభ్రమైన పరిసరాలు, రక్షిత తాగునీరు అందించాలన్నారు. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడరాదని స్పష్టం చేశారు.
తాగునీటి పథకాలకు నిధులు
ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీర్ డి.శ్రీనివాసులు మాట్లాడుతూ అమృత్ కింద ఏడు ప్రాజెక్ట్‌లకు రూ.331 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. తక్కెళ్ళపాడు నుంచి బుడంపాడు వరకు పైపులైన్లు వేసి ఏటుకూరు గ్రామం వద్ద ఐదు లే అవుట్లకు నీరు ఇచ్చేందుకు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గోరంట్ల వద్ద రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా చుట్టు పక్కల గ్రామాలకు కూడా నీరు అందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. ప్రసాద్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, నగర పాలక సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ సుందరరామి రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన పాల్గొన్నారు.
ఆహార సరఫరా సవ్యంగా సాగాలి
పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా ఆహారం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పీఎం పోషణ్ – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతలో లోపాలు ఉండరాదని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఈవో రేణుక మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకం కింద నెలకు రూ.3.32 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పి.డి. టి.విజయ లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.తులసి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జె.పద్మ, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత తదితరులు పాల్గొన్నారు.
రక్తహీనతను రూపుమాపేలా చర్యలు
జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రక్త హీనతను రూపుమాపాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా సంస్థలలో బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ రమణ మూర్తి, జడ్పీ సీఈఓ వి. జ్యోతి బసు, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గాబాయి, డీఈవో రేణుక, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా