
పేదల ప్రాణాలతో కూటమి చెలగాటం
45 మంది చనిపోతే స్పందన ఉండదా? మరణాలకు కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియదట బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలిచ్చి చేతులు దులుపుకొంటే చాలా? అడిగేవారు లేరని పేదల ప్రాణాలతో ఆటలాడొద్దు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తురకపాలెం మరణాలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
గుంటూరు వెస్ట్ : గుంటూరు శివారు ప్రాంతం తురకపాలెం గ్రామంలో 45 మంది చనిపోతే ఇప్పటికీ సరైన కారణాలు కనుక్కోకపోవడం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు దుయ్యబట్టారు. శనివారం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడుతూ పేదల మరణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. ఆ మరణాలకు కారణాలు తెలుసుకోలేదని నిలదీశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన గనుక దాటవేసే ధోరణని అవలంబిస్తున్నారని తెలిపారు. తక్షణమే నిజనిర్ధారణ కమిటీ వేసి అసలు కారణాలకు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
కల్తీ మద్యమే మరణాలకు కారణం
ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోందన్నారు. దాని కారణంగానే 45 మంది మరణించారన్నారు. కంటితుడుపు చర్యగా రూ.5 లక్షలు కొందరి కుటుంబాలకే ఇచ్చారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలను రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పరిష్కారం గురించి
ఆలోచించాలి
రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సమస్యను దాటవేసే ధోరణితో కాకుండా పరిష్కారం చూపేలా వ్యవహరించాలన్నారు. తురకపాలెంలో కలుషిత నీటి సమస్య గత 5 నెలలుగా ఉందన్నారు. తాగునీటిలో హాని చేసే బ్యాక్టీరియా ఉందని తక్షణమే ప్లాంట్‌ను పరిశుభ్రం చేయాలని తెలిపారు. నగర పాలక సంస్థ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటిని సరఫరా చేయాలన్నారు.
కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల రెడ్డి, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, మంగళగిరి సమన్వయ కర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ సమన్వయ కర్త వనమా బాల వజ్రబాబు, తూర్పు సమన్వయ కర్త షేక్ నూరి ఫాతిమా, నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, రాష్ట్ర వాలంటీర్ల విభాగం జోనల్ అధ్యక్షుడు వంగా సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, తురకపాలెం ఎంపీపీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పిల్లి మేరీ, నాయకులు, ఎంపీపీలు, జడ్పీపిపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల ప్రాణాలతో కూటమి చెలగాటం