
పెదకాకాని శివాలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై నేడు..
మూడో రోజూ ఇంద్రకీలాద్రిపై అదే రద్దీ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ కొనసాగిన వైనం అన్న ప్రసాద స్వీకరణకు భక్తుల బారులు నేడు కాత్యాయనీదేవిగా దుర్గమ్మ దర్శనం
గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం
ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక
ఖడ్గమాలార్చన(ఆరో అంతస్తు)
ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన(ఆరో అంతస్తు)
ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం(యాగశాల)
ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన(లక్ష కుంకుమార్చన వేదిక)
సాయంత్రం 5 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ
సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి
రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం
అన్నపూర్ణాదేవిగా
భ్రమరాంబ దర్శనం
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించారు. శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున సుప్రభాతసేవతో పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో నిర్వహించిన చండీ హోమం , రుద్ర పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాలభోగం నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనం మూడు క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అమ్మవారి మహా నివేదన, పంచహారతుల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడితో పాటు కుమ్మరిపాలెం వైపు క్యూలైన్లు రద్దీగా కనిపించాయి.
సర్వ దర్శనం క్యూలైన్లలో రద్దీ
బుధవారం తెల్లవారుజాము నుంచి సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు క్యూలైన్‌లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉపవాసంతో ఉండే భవానీలకు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలకు చెందిన భక్తులు దీక్షలను స్వీకరించి దర్శనానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్‌లో రద్దీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది.
వీఐపీ క్యూలైన్‌లో అనుమతి..
సేవా బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది ఎవరైనా వీఐపీ క్యూలైన్ ద్వారానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్, మీడియా పాయింట్ల వద్ద పలు మార్లు తనిఖీలు నిర్వహించారు. సిఫార్సులతో దర్శనం కోసం నేరుగా వస్తున్న వారిని ఆపి కార్డులు తనిఖీలు చేశారు. దీంతో చిన్న గాలిగోపురం పరిసరాల్లో, సీఎం గేటు వద్ద రద్దీ అదుపులోకి వచ్చింది.
అన్నదాన భవనంలో తనిఖీలు..
అమ్మవారి అన్నప్రసాదం కోసం తరలివచ్చిన భక్తులతో మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనం కిటకిటలాడింది. మరో వైపున అన్న ప్రసాద నాణ్యతలలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్‌కలెక్టర్ ఎస్. ఇలక్కియ వేరు వేరుగా తనిఖీలు నిర్వహించారు.
మూడో రోజు ఆదాయం రూ.31.08లక్షలు
దసరా ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం దేవస్థానానికి రూ. 31.08 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ.10.56లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ.3.46లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.98లక్షలు, ఆరు లడ్డూ బాక్స్‌ల విక్రయం ద్వారా రూ.11.89లక్షలు, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం, సేవల ద్వారా రూ.2.10 లక్షల మేర ఆదాయం లభించిందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 58 వేల మంది అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారని, అన్నప్రసాదం 22,506 మందికి పంపిణీ చేశామని పేర్కొన్నారు.

పెదకాకాని శివాలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

పెదకాకాని శివాలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

పెదకాకాని శివాలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

పెదకాకాని శివాలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు