
గాయత్రీ దేవిగా బాలచాముండేశ్వరి
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రం అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్య్రుత్సవాలలో భాగంగా బుధవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. దసరా వేడుకలలో మూడో రోజు సహస్ర కుంకుమార్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చనతోపాటుగా గాయత్రీదేవికి సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొన్నారు.