
‘డీఈఓ పూల్’ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నియామకాల కంటే ముందుగానే డీఈఓ పూల్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పేర్కొన్నారు. గురువారం జిల్లాకోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బసవ లింగారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1236 మంది డీఈఓ పూల్‌లో ఉన్నారని, 2016లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిలకడగా ఏ ఒక్క పాఠశాలలో పనిచేయలేక పోయారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా ఉన్నారని తెలిపారు. వీరికి ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు ద్వారా కేడర్‌లో జూనియర్లుగా మిగిలిపోతారన్నారు. న్యాయపరమైన అంశాలతో వీరికి ఉద్యోగోన్నతులు అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ అర్హత గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పీఈటీ ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. డీఎస్సీ మాదిరిగానే జూనియర్ కాలేజీ, డైట్‌లలో నియామకాలు చేపట్టాలని కోరారు. ప్లస్ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు సబ్జెక్ట్ టీచర్స్ కొరతో ఇబ్బంది పడుతున్నారని, ఖాళీలను అర్హత గల స్కూల్ అసిస్టెంట్స్ తో భర్తీ చేసి విద్యా ప్రమాణాలు కాపాడలన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ దసరా పండుగకు పెండింగ్ నాలుగు డీఏ లలో ఒక్క డీఏ ఐనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు గత 15 నెలల నుంచి ఒక్క బకాయి విడుదల కాలేదన్నారు. సమావేశంలో జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మినారాయణ, జి.దాస్, ముని నాయక్, టి.రామారావు, పి.వేణుగోపాలరావు, కిరణ్, శివరామకృష్ణ,మూర్తి, తదితరులు పాల్గొన్నారు.