
అలరించిన గాత్ర కచేరి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం గాత్ర కచేరి నిర్వహించారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత నృత్య పాఠశాల, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంయుక్తంగా నిర్వహించగా, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. నాగార్జున స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ వీజే.వినయకుమార్ అధ్యక్షత వహించారు. టీటీడీ ఆస్థాన గాయకుడు ఎం.రవిచంద్ర పలు గీతాలను అలపించారు. కీబోర్డుపై ఎస్.మురళీ, తబలాపై జీఎం. బాబురావు, రిథమ్స్‌పై ఎం.రెడ్డప్ప, శృతి వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.
స్వచ్ఛత.. సామాజిక బాధ్యత
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): స్వచ్ఛతను సామాజిక ఉద్యమంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించినప్పుడే గుంటూరు జిల్లా, నగరం క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుతాయని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. స్వచ్ఛత హీ సేవ– 2025లో భాగంగా గురువారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్‌లో ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్‘ కార్యక్రమంలో భాగంగా ఒక గంట శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛతను పాటిస్తూ, తాగునీరు, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధ్యానత ఇవ్వాలని తెలిపారు.
నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించినప్పుడే క్లీన్ గ్రీన్ గుంటూరు సాకారమవుతుందని పేర్కొన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవలో భాగంగా మాస్ క్లీనింగ్, పచ్చదనం పెంపునకు మొక్కలను విరివిగా నాటుతున్నామని తెలిపారు. ప్రజారోగ్య కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల 28న మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డెప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ సుందర్రామిరెడ్డి, ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓ రామారావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజారోగ్య కార్మికులు పాల్గొన్నారు.

స్వచ్ఛత.. సామాజిక బాధ్యత