
ప్రభుత్వానికి ప్రజల బాధలు పట్టవా ?
మాజీ మంత్రి విడదల రజిని గుంటూరు జీజీహెచ్‌లో డయేరియా బాధితులకు పరామర్శ
గుంటూరు మెడికల్: నగర ప్రజలు పది రోజులుగా డయేరియాతో అల్లాడిపోతున్నా కూటమి ప్రభుత్వానికి వారి బాధలు పట్టవని వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. డయేరియా బారిన పడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం ఆమె పరామర్శించారు. వార్డులో వసతులు లేకపోవడాన్ని గమనించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పది రోజులుగా డయేరియా తగ్గుముఖం పట్టలేదంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, ఇది కూటమి ప్రభుత్వం విఫలమేనని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో డయేరియా వస్తే కేవలం మూడు రోజుల్లోనే కట్టడి చేశామని గుర్తు చేశారు. యంత్రాంగం అంతా గుంటూరుపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడామని తెలిపారు. చికిత్స పొందుతున్న వార్డుల్లో వసతులు సైతం అరకొరగా ఉన్నాయని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా రూ. 1400 కోట్ల బడ్జెట్ ఉందని, అధికారులు తలుచుకుంటే తాగునీరు అందించవచ్చని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతోందని, అందుకు నిదర్శనం పదిరోజులైనా డయేరియా గుంటూరు నగరంలో అదుపులో లేకపోవడమేనని పేర్కొన్నారు. కలరా కేసులు చాలా అరుదుగా వింటామని, గుంటూరులో 11కు పైగా కేసులు నమోదైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డయేరియా, కలరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, పెద్ద విషయంలా కనిపించడం లేదని విమర్శించారు. తురకపాలెంలో 40 మందికిపైగా చనిపోయారని, దానికి ఇప్పటి వరకు కారణాలు ప్రభుత్వం తెలియజేయలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటైజేషన్‌పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వారికి అమ్మేసి, సొమ్ము చేసుకోవడంలో బిజీగా కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆరోపించారు. మెడికల్ కాలేజీలపై చర్చకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు పాల్గొన్నారు.