
కృష్ణమ్మ ఉగ్రరూపం
కొల్లూరు: కృష్ణమ్మ ఉగ్రరూపంతో నదీ పరీవాహక లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. వాణిజ్య పంటలు ముంపు బారిన పడుతున్నాయి. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.44 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తింది. మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల చుట్టూ ఇటుకరాయి తయారీకి అవసరమైన మట్టి కోసం తవ్విన భారీ గుంతల్లోకి నీరు చేరింది. చింతర్లంక, గాజుల్లంక, పోతార్లంక, దోనేపూడి కరకట్ట దిగువు ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. పంట భూములలోకి వరద నీరు ప్రవేశించింది. అరటి, కంద, కూరగాయలు, పసుపు, మినుము పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇంచుమించు 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలే అవకాశాలున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ప్రజలను ఆప్రమత్తం చేశారు. వరద తీవ్రత పెరిగిన పక్షంలో ప్రజలను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు మండలంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.