
విజయకీలాద్రిపై వీరలక్ష్మి అలంకారం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం రెండవ రోజుకు చేరాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారు వీరలక్ష్మిగా దర్శనమిచ్చారని తెలిపారు. ఉదయం 9 గంటలకు తిరుమంజనం అలంకరణ, భక్తులతో సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు వీరలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ, అర్చన, స్వామి వారి మంగళా శాసనాలతో కార్యక్రమాలు ఘనంగా ముగిశాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో వీరలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలియజేశారు.