
గుంటూరులో 21 వాటర్ ప్లాంట్లు సీజ్
నెహ్రూనగర్: నగరంలో కలుషిత తాగు నీటిని సరఫరా చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రజారోగ్యం దృష్ట్యా వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు సీజ్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో కలుషిత తాగు నీటి వలన డయేరియా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న 120 మినరల్ వాటర్ ప్లాంట్లు సరఫరా చేసే తాగు నీటి శాంపిల్స్‌ను మంగళగిరిలోని ఐపీఎం పీహెచ్ ల్యాబ్, గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలోని రీజినల్ పీహెట్ ల్యాబరేటరీలో పరీక్షించగా అందులో 21 ప్లాంట్ల నుంచి విక్రయించే నీటిలో హానికారక బ్యాక్టీరియాను గుర్తించడం జరిగిందన్నారు. సదరు ల్యాబ్ రిపోర్టులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం తక్షణమే ప్రజారోగ్యానికి భంగం కలిగించే హానికారిక బ్యాక్టీరియాలను కలిగియున్న నీటిని విక్రయిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిందన్నారు.
సీజ్ చేసిన ప్లాంట్లు ఇవే..
నగరంలోని ఐపీడీ కాలనీలోని పెరల్స్ ఎంటర్ ప్రైజేస్, నల్లచెరువులోని నీల్ డ్రాప్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డులోని మై ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, చరణ్ వాటర్ ప్లాంట్, రెడ్ల బజార్‌లోని కేపీ రావు ప్లాంట్, అంబేడ్కర్ నగర్‌లోని జేఎస్ వాటర్ ప్లాంట్, పాత గుంటూరు బాలాజీనగర్‌లోని ఏకా వారి వీధి వాటర్ ప్లాంట్, మల్లిఖార్జున పేటలోని గురుశ్రీ మినరల్ వాటర్ ప్లాంట్, ఏటీ అగ్రహారంలోని బాషా కూల్‌డ్రింక్, శివనగారాజు కాలనీలోని వాసవి వాటర్ ప్లాంట్, నెహ్రూనగర్‌లోని ఆర్‌కే వాటర్ ప్లాంట్, నగరాలలోని స్వాతి ఫుడ్ అండ్ వాటర్ ప్లాంట్, స్థంభాలగరువులోని ఎలైన్ ఫ్రెష్ వాటర్, మద్దిరాల కాలనీలోని పరమేష్ హోల్ సేల్, సంపత్ నగర్‌లోని నరేష్ షాప్, కోబాల్ట్ పేటలోని ఉమర్ బాషా ఫ్లేవర్డ్ వాటర్, పలకలూరులోని ఎన్‌టీఆర్ సుజల ప్లాంట్, హిమని నగర్‌లోని సరస్వతి కృష్ణ స్టోర్, బుడంపాడులోని స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్, ఏటుకూరులోని మేఘన షాప్, లాలుపురం రోడ్డులోని 76వ సచివాలయం దగ్గరలోని ప్లాంట్లను నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు సీజ్ చేశారు.