అంతంకాని డ‌యేరియా భూతం | - | Sakshi
Sakshi News home page

అంతంకాని డ‌యేరియా భూతం

Sep 25 2025 7:09 AM | Updated on Sep 25 2025 1:38 PM

గుంటూరు మెడికల్‌: డయేరియా భూతం గుంటూరు నగరాన్ని పట్టి పీడిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజులుగా నగరంలో వాంతులు, విరేచనాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కి వస్తున్నారు. వ్యాధిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

కలరా భయంతో వణుకు

ఓ పక్క డయేరియాతో వణికిపోతున్న నగర ప్రజానీకానికి మరోపక్క కలరా భయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారుల గణాంకాల ప్రకారం గుంటూరు నగరానికి చెందిన ముగ్గురు కలరాతో జీజీహెచ్‌లో చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యారు. అయితే, పూర్తి స్థాయిలో నివేదికలు బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను కూడా అధికారులు దాస్తున్నారు. డయేరియా, కలరా బాధితుల గణాంకాలను వివరించేందుకు ముందుకు రావడం లేదు.ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే కారణాలతో సాధ్యమైనంత మేరకు గణాంకాలను దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలు చెబితే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయనే భయంతో అన్ని శాఖల వారు మౌనంగా ఉంటున్నారు.

వ్యాధి కట్టడి కీలకం

సాధారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేయాలి. వ్యక్తిగతంతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఈ వ్యాధుల కట్టడిలో కీలకం. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. మురుగు కాలువల్లో తాగునీటి పైప్‌లైన్లు ఇంకా మునిగే ఉన్నాయి. గతంలో జరిగిన ప్రాణ నష్టం నుంచి అధికారులు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. విధుల నిర్వహణలో నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.

ఏ మాత్రం తగ్గని డయేరియా

ఈనెల 15న గుంటూరు జీజీహెచ్‌లో మొట్టమొదటిసారిగా డయేరియా బాధితులు అడ్మిట్‌ అయ్యారు. నాటి నుంచి ప్రతిరోజూ చికిత్స కోసం వస్తూనే ఉన్నారు. ఇటీవల కలరా కలకలం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవైపు డయేరియా, మరోవైపు కలరాతో ఈ నగరానికి ఏమైందంటూ మేధావులు సైతం పెదవి విరుస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఇప్పటి వరకు 165 మందికి పైగా డయేరియాతో చికిత్స పొందారు. వీరిలో ఆరోగ్యం కుదుటపడిన సుమారు 80 మందిని డిశ్చార్జి చేశారు. వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవడంతో కిడ్నీల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న ముగ్గురిని ఐసీయూలో అడ్మిషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తొలుత డయేరియా బాధితుల కోసం ఇన్‌పేషెంట్‌ విభాగంలోని జనరల్‌ సర్జరీ విభాగం 333 నంబరును కేటాయించారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ప్రతిరోజూ అడ్మిషన్లు రావడంతో ఆర్థోపెడిక్‌ విభాగంలోని పేరాప్లీజియా, ఇతర సర్జరీ వార్డులను కేటాయించారు.

రాత్రి అయితే కంటి మీద కునుకు కరువు

ముఖ్యంగా రాత్రి సమయాల్లో బాధితులు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళుతున్నారు. పగలంతా ఇళ్ల వద్దే ఉన్నా వాంతులు, విరేచనాలు కట్టడి కాకపోవడంతో రాత్రి సమయాల్లో జీజీహెచ్‌కి వెళుతున్నట్లు బాధితులు, వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి పది గంటల వరకు కేసులు అడ్మిట్‌ అవుతున్నాయి. చికిత్స కోసం బాధితులను తీసుకెళ్లే కుటుంబ సభ్యులకు, ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, సిబ్బందికి సైతం రాత్రి అయితే కంటి మీద కునుకు లేకుండా పోతోంది.

ముందస్తు జాగ్రత్త చర్యలు.. కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా

గుంటూరు వెస్ట్‌: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో బుధవారం నగరపాల సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాస్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో సీజనల్‌ వ్యాధులు నియంత్రణకు వైద్య, ఆరోగ్య, మున్సిపల్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కృషి చేయాలని ఆమె చెప్పారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నియమించిన జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని ఆమె తెలిపారు. పాత గుంటూరులో డయేరియా కేసులు నమోదవుతున్న తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టితో ముందస్తు నివారణ చర్యలను అమలు చేయాలని ఆదేశించారు. 

ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకోవాలని తెలిపారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని వెంటనే వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందించాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గురువారం ఉదయం నాటికి పూర్తిస్థాయిలో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులతో అవసరం మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు లేని దుకాణాలను వెంటనే మూయించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి, జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రమణ యసశ్వీ, జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్‌, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఎస్‌ఈ కల్యాణ్‌ చక్రవర్తి, నగరపాలక సంస్థ సీఎంహెచ్‌ఓ శోభారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో డ‌యేరియా బాధితులు1
1/2

గుంటూరు జీజీహెచ్‌లో డ‌యేరియా బాధితులు

కలెక్టర్‌2
2/2

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement