
యథావిధిగా పింఛన్ల పంపిణీ
నెహ్రూనగర్: సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ గత నెలలో చేసిన విధంగానే ఈ నెలలోనూ అర్హులైన లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.15,000, రూ.10,000, రూ.6,000, రూ.4,000 కేటగిరిల పింఛన్ యథావిధిగానే చేస్తారని తెలిపారు.
ఒత్తిళ్ల జీవితంలో ఆధ్యాత్మిక చింతన అవసరం
ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ నగేష్‌బాబు
మంగళగిరి టౌన్: ప్రస్తుత ఒత్తిళ్లతో కూడుకున్న జీవితాలలో ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ నగేష్‌బాబు అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో వినాయక చవితి మహోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల గణపతి విగ్రహం వద్ద లడ్డూలు, స్వామివారి కరెన్సీ నోట్ల దండలకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగేష్‌బాబు మాట్లాడుతూ వినాయకచవితి వంటి ఉత్సవాలు ప్రజల్లో ఐకమత్యానికి దోహద పడతాయని, ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఏ మతమైనా అందరూ బాగుండాలని, ఇతరులకు హాని కలిగించరాదని అన్నారు. అనంతరం భక్త బృంద ప్రతినిధులు కృష్ణారావు, అయ్యప్పరెడ్డి, చిన్న వెంకటేశ్వర్లు కమాండెంట్ నగేష్‌బాబును ఘనంగా సత్కరించారు.
అందరి ఆరోగ్యం
మన బాధ్యత
బాపట్ల: జిల్లాలోని ప్రజలందరి ఆరోగ్యం మన బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టరు విజయమ్మ పేర్కొన్నారు. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2గా పదోన్నతులు కల్పించేందుకు కృషి చేసిన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ విజయమ్మను ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ జిల్లా ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తు చేశారు. కష్టపడి పని చేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి.నాగేశ్వరరావు, ఏఎన్‌ఎంలు, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.

యథావిధిగా పింఛన్ల పంపిణీ